దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న జె.ఎన్.టి.యు.విద్యార్ధి కన్నయ్య కుమార్ అరెస్ట్ వ్యవహారం ఈరోజు కొత్త మలుపు తిరిగింది. అతను నేరుగా సుప్రీం కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, దానిని ఈరోజు విచారణకు స్వీకరించిన కోర్టు, ప్రస్తుతం ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని క్రింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోమని సూచించింది. డిల్లీ పాటియాలా కోర్టులో కొందరు న్యాయవాదులు తమపై దాడి చేసినందున తమకు వారి నుండి ప్రాణభయం ఉందని కన్నయ్య కుమార్ తరపున వాదించిన న్యాయవాదులు కోర్టుకు తెలుపగా, అతనికి పోలీస్ రక్షణ ఏర్పాటు చేయమని ఆదేశించింది. అతను మళ్ళీ డిల్లీలోని పాటియాలా కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ముంబై ప్రేలుళ్ళ సూత్రదారులలో ఒకడయిన అఫ్జల్ గురు మూడేళ్ళ క్రితం ఉరి తీయబడ్డాడు. డిల్లీ జె.ఎన్.టి.యు.లో పి.హెచ్.డి. చేస్తున్న కన్నయ్య కుమార్ నేతృత్వంలో కొందరు విద్యార్ధులు యూనివర్సిటీలో అఫ్జల్ గురు 3వ వర్ధంతి సభను నిర్వహించి, భారత్ కి వ్యతిరేకంగా ప్రసంగించినందుకు, డిల్లీ పోలీసులు అతనిని అరెస్ట్ చేసి అతనిపై దేశద్రోహం నేరం మోపారు.
అతనిపై అంత తీవ్రమయిన నేరాన్ని మోపడాన్ని సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టింది. అలాగే యూనివర్సిటీలో కన్నయ్య కుమార్ నిర్వహించిన సంస్మరణ సభలో ఇంకా ఎవరెవరూ పాల్గొన్నారు, వారిని ఎవరు ఎందుకు ప్రోత్సహించారు..వంటి వివరాలను దర్యాప్తు చేసేందుకు ఈ కేసును జాతీయ దర్యాప్తు బృందానికి అప్పగించాలని కేంద్రం భావించింది. కానీ సుప్రీం కోర్టు దానినీ తప్పు పట్టడంతో ఆ ఆలోచనని విరమించుకోవలసి వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కాలేజీల విద్యార్ధులు కన్నయ్య కుమార్ ని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో మోడీ ప్రభుత్వ తీరుని తీవ్రంగా నిరసిస్తున్నాయి. బీజేపీ. ఆర్.ఎస్.ఎస్.లకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి గొంతు నొక్కడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నోస్తోందని ఆరోపిస్తున్నారు.