కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎప్పుడు తీసుకోవాలన్నా… సంపూర్ణ అధికారం స్పీకర్‌కే ఉందని.. సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ప్రకటించింది. తాము స్వచ్చందంగా రాజీనామా చేశామని.. అయినా అంగీకరించకుండా స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని… తమ రాజీనామాలు ఆమోదించేలా.. తక్షణం ఆదేశించాలని పదహారు మంది ఎమ్మెల్యేలు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చివరికి.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. స్పీకర్‌కు అధికారాలున్నాయని తేల్చేసింది. అయితే నాలుగురోజుల కిందట… వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని.. స్పీకర్ సుప్రీంకోర్టులోనే చాలెంజ్ చేశారు. తన అధికారాలను వివరించారు. చివరికి.. సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్‌దే నిర్ణయమని ప్రకటించింది.
మరో వైపు… గురువారం అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరగనుంది. ఈ విశ్వాస పరీక్షకు.. హాజరు కావాలనే రూల్ ఏమీ లేదని.. కచ్చితంగా హాజరవ్వాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయాల్సిన పని లేదని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది ఎమ్మెల్యేల ఇష్టమని వ్యాఖ్యానించింది. దీంతో.. క్యాంపులో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు… గురువారం జరగనున్న విశ్వాస పరీక్షకు హాజరవడం కష్టమే. అయితే… ఇక్కడ స్పీకర్‌కు… నిర్ణయాధికారం ఉంది. ఆయా పార్టీలు కచ్చితంగా బలపరీక్షకు హాజరు కావాలని విప్ జారీ చేస్తాయి. హాజరు కాకపోతే.. వెంటనే అనర్హతా వేటు వేస్తారు. ఇదే రెబల్ ఎమ్మెల్యేలకు వణుకుపుట్టిస్తోంది.
రాజీనామాలు చేసినా… అనర్హతా వేటు వేసినా పదవి పోతుంది. కానీ.. ఆరేళ్ల పాటు.. ఎన్నికల్లో పోటీ చేయకుండా.. అనర్హతా వేటు వేస్తారేమోనన్న అనుమానం రెబల్ ఎమ్మెల్యేల్లో ఉంది. అదే జరిగితే.. తమ రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే వారు రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టారు. అయితే.. ఇప్పుడు మళ్లీ బంతి స్పీకర్ కోర్టుకే వచ్చింది. దాంతో.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.