కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయాలంటూ.. అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, జేడీఎస్‌లకు ఊరట దక్కలేదు. ప్రమాణస్వీకారంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న బి.ఎస్.యడ్యూరప్పను నిలువరించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ.. కాంగ్రెస్,జేడీఎస్ అర్థరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జస్టిస్ సిక్రి అధ్యక్షతన బెంచ్ అత్యవసరంగా పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
యడ్యూరప్ప వారం రోజులు మాత్రమే గడువు కోరితే..గవర్నర్ పదిహేను రోజులు సమయం ఇచ్చారని.. దీని వల్ల ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని సింఘ్వి కోర్టు దృష్టికి తెచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ -జేడీఎస్ కూటమికి ఉందన్నారు. యడ్యూరప్పకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదని వాదించారు. ఎమ్మెల్యేల లిస్ట్ ఇచ్చే వరకు అయినా ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేయాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం స్టే విధించలేమని స్పష్టం చేసింది. అయితే యడ్యూరప్ప.. గవర్నర్‌కు ఇచ్చిన లేఖను … సుప్రీంకోర్టులో సమర్పించాలని యడ్యూరప్పను ఆదేశించింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కేసుపై మళ్లీ విచారణ జరగనుంది.
గతంలో ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన కేసుల వివరాలను… కాంగ్రెస్, జేడీఎస్ తరపు లాయర్ సింఘ్వి కోర్టు ముందు ఉంచారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు అటార్నీ జనరల్ సమాధానాలు చెప్పుకోలేకపోయారు. మెజార్టీ ఉందని… బీజేపీ ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నదానిపై ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. యాంటి డిఫెక్షన్ లా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే వర్తిస్తుందన్నారు. అంటే.. ప్రమాణస్వీకారానికి ముందే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోతున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించడంతో అటార్నీ జనరల్ ..తన ఉద్దేశం అది కాదని కవర్ చేసుకున్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ మెజార్టీ సభ్యుల సంతకాలను గవర్నర్‌ను సమర్పించినప్పుడు.. బీజేపీకి ఎలా మెజార్టీ వస్తుందని… న్యాయమూర్తులు ప్రశ్నించారు. అదే సమయంలో నిజంగా మెజార్టీ ఉంటే పదిహేను రోజుల సమయం ఎందుకని ప్రశ్నించారు. అయితే బలపరీక్షలో అన్నీ తేలుతాయని.. అటార్నీ జనరల్ వాదించారు. గవర్నర్ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని… ప్రభుత్వం తరపు న్యాయవాదులు బలంగా వాదించారు.