చంద్రబాబు మాటలకు చేతలకు అస్సలు సంబంధం ఉండదు. ఆ మాటలు కూడా స్వంత వాళ్ళ విషయంలో అయితే వ్యవహారం ఒకలా ఉంటుంది. ప్రత్యర్థులు……అయినా చంద్రబాబు-జగన్‌లకు వేరే ప్రత్యర్థులు ఎవరు ఉన్నారులే. జగన్ విషయంలో మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. జగన్ కేసులను బాగా హైలైట్ చేస్తూ ఉంటాడు. తన కేసులు, స్టేల వ్యవహారాన్ని మాత్రం వీలైనంత తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కేసులకు భయపడి సోనియాగాంధీ, మోడీలతో జగన్ కుమ్మక్కువుతున్నాడని గంటల తరబడి ప్రచారం చేస్తాడు. ఓటుకు నోటు కేసు పుణ్యమాని చంద్రబాబు ప్రత్యేక హోదాను గాలికి వదిలేశాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తున్నాడు అంటే మాత్రం గయ్యిమని లేస్తాడు. నేను ఎవ్వరికీ భయపడను అని అస్తమానం చెప్తూ ఉంటాడు. ఓటుకు నోటు కేసుకు అస్సలు ప్రాముఖ్యతే లేదని, అదసలు కేసే కాదని జనాలను నమ్మించాలని చూస్తూ ఉంటాడు. ఈ రోజు ఓటుకు నోటు కేసుని సుప్రీం కోర్టు టేకప్ చేయడం గురించి ప్రశ్నించినప్పుడు కూడా చంద్రబాబుది అదే సమాధాం. ముఖ్యమంత్రి స్థాయికి నోటీసులు పంపించడమనేది చాలా చాలా చిన్న విషయమని జనాలను నమ్మించాలని చూస్తున్నాడు చంద్రబాబు.
కానీ చంద్రబాబుది కేవలం మేకపోతు గాంభీర్యమే అన్న విషయం కొన్ని గంటల వ్యవధిలోనే అందరికీ తెలిసిపోయింది. సుప్రీం కోర్టు ఓటుకు నోటు కేసుని స్వీకరించిన విషయం జనాల ఆలోచనల్లో మరీ ఎక్కువ రిజిస్టర్ అవకుండా ఉండేలా మీడియాను మేనేజ్ చేయాలని చంద్రబాబు చేసిన ప్రయత్నమే బాబు భయాన్ని బయటపెట్టేసింది. అలాగే సుప్రీం కేసు న్యూస్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఓటుకు నోటు కేసులో ఒక నిందితుడు అయిన తెలంగాణా టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీలో ప్రత్యక్షమవ్వడం కూడా బాబు ఆందోళనను పట్టిచ్చేదే. ఇకపైన చంద్రబాబు మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో…సుప్రీం కోర్టులో కూడా స్టే తెచ్చుకుంటాడో…లేక కేసునే కొట్టేసేలా ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో తెలియదు కానీ ఓటుకు నోటు కేసులో మాత్రం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. ‘బ్రీఫ్డ్ మీ’ అన్న వాయిస్ నాది కాదు అని చెప్పే ధైర్యం కూడా బాబుకు లేదు. ఆ మాటలు తాను మాట్లాడాడో లేదో చంద్రబాబుకు తెలియదా? ఆ మాటలు చంద్రబాబువి కాకపోతే ఈ పాటికి బాబు చేసే రచ్చ అంతా ఇంతా ఉండేది కాదు. ఒక రకంగా చంద్రబాబు అయితే బుక్కయ్యాడు. మరి ఈ సారి కూడా తనకు బాగా తెలిసిన విద్య అయిన ‘మేనేజ్మెంట్’ స్కిల్స్‌తో బయటపడతాడో లేక బుక్కవుతాడో చూడాలి మరి. చంద్రబాబు ఇబ్బందులు ఎలా ఉన్నా ఈ ఓటుకు నోటు కేసు పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలన్నీ తాకట్టుపెట్టబడుతున్నాయన్నది మాత్రం బాధాకరమైన వాస్తవం.