సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణంలో నిందితుడుగా అనుమానించబడుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు హైకోర్టు అనుమతి కోరినప్పుడు, ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకొన్నారు. గవర్నర్ గా తనకున్న చట్టపరమయిన ప్రత్యేక రక్షణ కవచాన్ని ఆయన ఉపయోగించుకొని ఈ కేసుల విచారణ నుండి తప్పించుకొంటున్నారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆయనను తక్షణమే పదవిలో నుండి తొలగించి, ఈ కేసులో విచారించేందుకు అవసరమయిన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్ పై సుప్రీం కోర్టు స్పందిస్తూ, గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ ని సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపింది. ఆయనతో బాటు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాళ్ళ నోటీసులు పంపింది. మూడు వారాలలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని వారిని కోరింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను నియమించేందుకు ఈ వ్యాపం సంస్థ సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తుంటుంది. గత రెండు దశాబ్దాలుగా ఈ వ్యాపం బోర్డులో చాలా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. కేవలం అవినీతి జరిగి ఉండి ఉంటే అది ఎవరి దృష్టిని ఇంతగా ఆకర్షించి ఉండకపోవచ్చును. కానీ గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ అవినీతి కుంభకోణంలో ఇంతవరకు 47మంది వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారిలో గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్ కూడా ఒకరు.
ఈ కుంభకోణంలో గవర్నర్ మొదలుకొని బోర్డు మెంబర్లు, ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, చివరికి విద్యార్ధులు వారి తల్లి తండ్రులు కూడా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇంతవరకు సుమారు 2000 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ వ్యాపం కుంభకోణం కేసు పరిశోధనను సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించిన తరువాత దర్యాప్తు వేగం పుంజుకొంది.