సీబీఐ కేసులు, ఈడీ కేసులు నమోదైతే.. మొదట సీబీఐ కేసులు విచారణ జరపాలని.. ఆ కేసులు తేలిపోతే.. ఈడీ కేసులు కూడా చెల్లవని.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేయకపోతే.. ఈడీ , సీబీఐ కలిసి పెడుతున్న కేసులన్నీ తేలిపోయే ప్రమాదం ఉండటంతో ఆలస్యంగానైనా సవాల్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈడీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా.. లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలన్నది ఆరోజు నిర్ణయిస్తామని సెప్టెంబర్ 5వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతి ఆస్తుల విడుదలకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 14న సుప్రీంకోర్టులో జరగనుంది. జప్తు ఆస్తులకు సమాన విలువైన ఎఫ్డీలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఈడీ సవాల్ చేసింది.
మరో వైపు సీబీఐ కోర్టులో చాలా రోజుల తర్వాత అక్రమాస్తులపైసీబీఐ కేసుల విచారణలు ప్రారంభమయ్యాయి. మొదట నిందితులు గత పదేళ్లుగా ఒకరి తర్వాత ఒకరు దాఖలు చేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లను నెలాఖరులోపు విచారణ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అసలు కేసుల విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.