బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలకు కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం .. గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనాలు స్పష్టమైన గడువు గురించి చెప్పలేదని ఇప్పుడు తాము ఎలా ఆ తీర్పును కాదని మరో నిర్ణయం వెలువరించగలమని ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభల విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయం. కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. ఈ క్రమంలో గతంలో కూడా ఫలానా తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది కానీ.. ఆదేశించలేదు.
తాజాగా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని ప్రతివాదులుగా కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కాలయాపన చేసే పనులు మానుకోవాలని సూచించింది. మరో ఫిరాయిపునకు పాల్పడినట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయని దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో హైకోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిచిందన్నారు. అయినా స్పీకర్ స్పందించలేదని.. కనీసం నోటీసులు ఇవ్వలేదన్నారు. తాము ఫిర్యాదు చేసి ఏడాది అయిందన్నారు.
జస్టిస్ గవాయ్ వ్యాఖ్యల ప్రకారం చూస్తే..బీఆర్ఎస్ పోరాటం చివరికి స్పీకర్‌కు సుప్రీంకోర్టు కూడా గడువు పెట్టలేదని అర్థమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజ్యాంగధర్మాసనాల తీర్పులు స్పీకర్ అధికారులను బట్టే ఉండటమే దీనికి కారణం అనుకోవచ్చు. ఈ విషయంలో ప్రతివాదులుగా కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ జరగనుంది.