జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయనపై ఉన్న ఈడీ, సీబీఐ కేసులకు సంబంధించి పూర్తి వివరాలను రెండు వారాల్లో ఇవ్వాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులు ముందుకు పోవడం లేదని విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు వారు రకరకాలుగా ఒకటి తర్వాత ఒకటిగా వేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగానే కేసులు ముందుకు సాగడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో సుప్రీంకోర్టు ఈ కేసుల వివరాలను రెండు వారాల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు, తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు, పెండింగ్ కేసుల వివరాలు అన్నీ ధర్మానసం ముందు ఉంచాలని ఆదేశించింది. వాటిని ఇస్తే తగు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల పదమూడో తేదీకి వాయిదా వేసింది. జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదయ్యి పన్నెండేళ్లు దాటిపోయింది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క కేసులో కూడా విచారణ ప్రారంభం కాలేదు.
అప్పట్నుంచి కేసుల విచారణలు పెండింగ్ పడుతూనే ఉన్నాయి. ఈ కేసుల్లో నిందితులు అందరూ ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూనే పోతున్నారు . దీని వల్ల అసలు విచారణ ప్రారంభం కావడం లేదు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లతోనే సమయం గడిచిపోతోంది. ఈ కేసుల్లో జగన్ కోర్టుకు హాజరు కావడం కూడా మానేశారు. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నారు దానిపై తదుపరి విచారణ ఖరారయ్యే అవకాశం ఉంది.