మీడియా అత్యుత్సాహం, విశ్వసనీయ వర్గాల పేరిట…మీడియా చేసే ప్రచారం సుప్రీంకోర్టునూ చికాకు పెడుతోంది. అందుకే.. కొత్త ఏడాదిలో తొలి అధికారిక ప్రకటన మీడియాను ఉద్దేశించే చేసింది. సుప్రీంకోర్టుకు సంబంధించిన అంతర్గత విషయాలు అత్యంత రహస్యంగా ఉంటాయని…ఆ విషయాలను మీడియాకు లీక్ చేయడం సాధ్యం కాని విషయమని… ఓ ప్రకటన జారీ చేసింది. ఇలాంటి ప్రకటనకు కారణం ఏమిటన్నది సుప్రీంకోర్టు స్పష్టం చేయలేదు. కానీ సుప్రీంకోర్టులోని అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయంటూ.. కొన్ని మీడియా సంస్థలు న్యాయమూర్తులపై రకరకాల కథనాలు రాస్తున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .. సీజేఐ బోబ్డేకి రాసిన లేఖపై..ఆయన స్పందించారని..జస్టిస్ రమణ నుంచి వివరణ కోరారని.. ఇటీవలి కాలంలో ప్రచారం ఎక్కువైంది.
ఇలాంటి వార్తలు రాస్తున్న మీడియా… దానికి సుప్రీంకోర్టు వర్గాలు చెప్పాయని.. రాస్తున్నాయి. నేరుగా.. తామే లీక్ చేసినట్లుగా.. మీడియా కథనాలు ఉండటంతో సుప్రీంకోర్టులో అంతర్గతంగా ఏం జరిగినా.. అంతా రహస్యంగా ఉంటుందని…తాము మీడియాకు చెప్పబోమని.. ప్రకటన చేయాల్సి వచ్చింది. మీడియా ప్రచారాల ద్వారా న్యాయవ్యవస్థను కంట్రోల్ చేయడం ఎలాగో.. ఇప్పుడు రాజకీయ నేతలు బాగా నేర్చుకున్నారు. ఆ వ్యూహాల ప్రకారం… న్యాయమూర్తులను.. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఇలాంటి కథనాలు వెలుగు చూస్తున్నాయని అంటున్నారు. ఇటీవలి కాలంలో… ఏపీ చీఫ్ జస్టిస్ను బదిలీ చేయడం.. అది కూడా.. సీఎం జగన్ లేఖ రాసిన తర్వాత బదిలీ చేయడంతో… ఆ లేఖ వల్లే బదిలీ చేశారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై మీడియా కథనాలు… మరింత సంచలనాత్మకం అవుతున్నాయి.