తిరుమల శ్రీవారి ప్రసాద లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఐద్దరు సీబీఐ, ఇద్దరు సిట్, ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారితో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీ విచారణ చేపడుతుంది. శనివారం కల్లా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పై ఎలాంటి అనుమానాల్లేవని అయితే.. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి విస్తృత సిట్ ను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని కేంద్రం తన అభిప్రాయంగా కోర్టుకు తెలిపింది.
ఇద్దరు సీబీఐ అధికారులు..అలాగే ప్రస్తుతం సిట్ లో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు..మరో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారితో సిట్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ అంశంలో చాలా కీలక విషయాలు వెలుగులోి వచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏఆర్ డెయిరీలో కల్తీని గుర్తించింది. లైసెన్స్ రద్దునకు నోటీసులు జారీ చేసింది. మరో వైపు ఏఆర్ డెయిరీ నెయ్యి కాంట్రాక్టు తీసుకుంది కానీ సరఫరా చేసింది మాత్రం వేరే వారని ఇప్పటికే గుర్తించారు. సీబీఐ అధికారులతో కూడిన దర్యాప్తులో అసలు నెయ్యి కల్తీ పై సమగ్ర .. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
విచారణ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెయ్యి కల్తీ వ్యవహారం సమయంలో తాను టీటీడీ చైర్మన్ అన్న విషయాన్ని సుబ్బారెడ్డి చెప్పకపోవడంపై మండిపడింది. భక్తుల విశ్వాసంతో రాజకీయాలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా చేసుకోవద్దని స్పష్టం చేసింది.