రాఫెల్ విమానాల వ్యవహారంలో అతి పెద్ద స్కాం జరిగిందని.. దాఖలైన పిటిషన్లపై… సుప్రీంకోర్టు అగ్రెసివ్‌గా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ధరలు, ఇతర వివరాలు వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం పది రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఈ ఒప్పందంలో ఆఫ్సెట్ భాగస్వాముల వివరాలు కూడా చెప్పాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆఫ్సెట్ భాగస్వామిగా.. అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఉంది. అసలు స్కామ్ మొత్తం ఈ కంపెనీ చుట్టూనే తిరుగుతోంది.
యుద్ధ విమానాల ధరలను రహస్యంగా ఉంచాల్సినందున వీటిని వెల్లడించడం సాధ్యం కాదంటూ అటార్నీ జనరల్ కోర్టు ఎదుట వాదించే ప్రయత్నం చేశారు. అది రహస్యమే అయితే.. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తాము సాంకేతిక వివరాలు వెల్లడించాలని కోరడం లేదనీ.. బహిర్గతం చేయకూడని కీలక సమాచారం ఏదైనా ఉంటే కేంద్రం గోప్యంగా ఉంచవచ్చునని స్పష్టం చేసింది. ధరలు, సాంకేతిక వివరాలు మినహా రాఫెల్ ఒప్పందం సందర్భంగా జరిగిన నిర్ణయాల ప్రక్రియపై సీల్డ్ కవర్లో వివరాలు సమర్పించాలని ఈ నెల 10 సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిది. అయితే దానికి కొనసాగింపుగా ఇప్పుడు ధరలు, సాంకేతిక వివరాలు కూడా సమర్పించాలని ఆదేశించడం కలకలం రేపుతోంది.
పది రోజుల తర్వాత.. సుప్రీంకోర్టు.. రాఫెల్ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే.. సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషనర్‌కు విజ్ఞప్తి సుప్రీంకోర్టు విభిన్నంగా స్పందించింది. ప్రస్తుతం సీబీఐలోనే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయనీ… అవన్నీ చక్కబడిన తర్వాత పరిశీలిస్తామని చెప్పింది. అదే సమయంలో.. రెండు వారాల్లో సీబీఐలో వివాదం ముగిసిపోనుంది. సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలను.. రెండు వారాల్లో తేల్చాలని.. సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు.. కేంద్రాన్ని పది రోజుల్లో రాఫెల్ పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అంటే.. రెండు దాదాపుగా ఒకే సారి జరగనున్నాయి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అ నిర్ణయం సంచలనం సృష్టించే అవకాశాలు కొట్టిపారేయలేమనేది రాజకీయవర్గాల అంచనా..!