హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై, సంబంధిత మిస్టరీ మరణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై దాఖలైన వివిధ ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటికీ కలిపి స్పందిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కుంభకోణంలో సంబంధమున్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్‌ను తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ గవర్నర్‌కు నోటీసు జారీ చేసింది. కుంభకోణంలో గవర్నర్ ప్రమేయం ఉన్నట్లు వ్యాపమ్ సీఈఓ స్టేట్మెంట్ ఇచ్చిఉన్న నేపథ్యంలో గవర్నర్‌పై ఎఫ్ఐఆర్ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టేయటం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగాలు, వృత్తివిద్యాకోర్సులలో ప్రవేశాలకై పరీక్షలు నిర్వహించే ఈ మధ్యప్రదేశ్ వ్యావసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్) వ్యవహారాలలో జరిగిన అక్రమాలు 2013లో బయటకొచ్చినదగ్గరనుంచి ఇప్పటివరకు 45కుపైగా వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితులలో, అసహజంగా మరణించారు. ఇవాళకూడా ఈ కేసులో కీలక సాక్షి అయిన సంజయ్ యాదవ్ అనే పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద పరిస్థితిలో మరణించటం విశేషం. ఈ కుంభకోణం ఇచు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు, అటు ప్రధాని నరేంద్ర మోడికి కూడా ఇబ్బందికరంగా మారింది.