సుప్రీంకోర్టు గురువారం నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడంపై దాఖలైన పిటిషన్పై విచారణలో కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ప్రచారంలోకి తీసుకురావాలని ఆదేశించింది. అధికారిక వెబ్సైట్లలో, సోషల్ మీడియాల్లో ఉంచాలని స్పష్టం చేసింది. నిజానికి గతంలోనే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కానీ.. అమలులోకి రాలేదు. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులున్నవారిని అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారు? నేర చరిత్ర లేనివారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదు?.. అనే కారణాలను రాజకీయ పార్టీలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నా ఒక అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశారో చెప్పేటప్పుడు కేవలం విజయావకాశాలే కాకుండా… వారి విద్యార్హతలు, సాధించిన విజయాలు, ప్రతిభాపాటవాల ప్రస్తావన తప్పకుండా ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించంది. ఎన్నికలలో పోటీ చేసే నేరచరితుల సంఖ్య పెరిగిపోతోందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం… అభ్యర్థి నేర చరితుడని తెలిసిన తర్వాత ప్రజలు ఆ అభ్యర్థిని ఎక్కునే విషయంలో.. ఆలోచిస్తారన్న అభిప్రాయంతో.. ఇలాంటి తీర్పు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
కానీ ప్రస్తుతం దేశంలో..అభ్యర్థి నేరచరిచుడు… అవినీతి పరుడు అని.. స్పష్టంగా తెలస్తున్నా.. వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఓట్లతో గెలుస్తున్నారు. దీని వల్ల నేర చరితులు చట్ట సభలకు సులువుగానే వస్తున్నారు. అలా వచ్చిన వారు తాము ప్రజాకోర్టులో గెలిచామని..ఇతర న్యాయస్థానాలతో తమకు పనేమిటన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఎంత వరకు మేలు చేస్తాయో… వేచి చూడాల్సిందే..!