విశాఖ రామానాయుడు స్టూడియోలో సగం కబ్జాకు వైసీపీ నేతలు వేసిన ప్లాన్‌కు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఆ భూముల విషయంలో 2003 లో ఇచ్చిన జీవోకు తగ్గట్లుగా మాత్రమే ఉండాలని ఇతర నిర్మాణాలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హైకోర్టు కొట్టి వేసింది. దీంతో రామకృష్ణబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి లోపు స్పందించాలని ప్రభుత్వానికి , ప్రతి వాదులకుు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
రామానాయుడు స్టూడియోకు కేటాయించిన స్థలంలో దాదాపుగా పదిహేను ఎకరాలు లే ఔట్ గా మార్చి ఇళ్లు కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ అంశంపై అన్నీ రహస్యంగా జరిగిపోయాయి. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అవి స్టూడియోకు కేటాయించిన స్థలాలు. అక్కడ ఇళ్ల నిర్మాణం చట్ట విరుద్ధం. అలా చేస్తే వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. కానీ అన్నీ ప్రభుత్వం నుంచి అనుమతులు పక్కాగా వచ్చేశాయి. స్టూడియో యజమాని అయిన దగ్గుబాటి సురేష్ బాబు పేరు మీదనే ఇళ్ల నిర్మాణం.. లే ఔట్ వేస్తున్నారు. కలెక్టర్ ఎన్వోసీ ఇచ్చారు.
అన్నీ సురేష్ బాబు పేరు మీదనే జరుగుతున్నప్పటికీ.. అసలు సురేష్ బాబుకు ఇందులో ప్రమేయం లేదని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు తెర వెనుక బెదిరింపులతో ఈ వ్యవహారం నడుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు రామానాయుడు స్టూడియోను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆ స్టూడియోను చూసి వైఎస్ భారతి రెడ్డి మనసు పడ్డారని.. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించారని అయ్యన్నపాత్రుడులాంటి వాళ్లు చాలా సార్లు చెప్పారు. గతంలో స్టూడియో ను స్వాధీనం చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రక్రియ ఏమయిందో కూడా బయటకు రాలేదు. కానీ సురేష్ బాబు పేరు మీదనే లే ఔట్లు ఆయన ప్రమేయం లేకుండానే పడిపోయాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ లే ఔట్ల అనుమతులు చెల్లవు. ప్రభుత్వం మారిన తర్వాత అనుమతులు ఇచ్చిన అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడడనుంది.