దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే తెలిపారు. నియమితులయ్యే విశ్రాంత న్యాయమూర్తి ఢిల్లీలోనే ఉండి ఈ కేసును దర్యాప్తు చేసేలా చూస్తామన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు న్యాయవాదులు గతంలోదాఖలు చేసిన పిల్‌పై సుప్రీం ఈ విచారణ చేపట్టింది. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు.
కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ కోసం మాజీ జస్టిస్ పి.వి.రెడ్డిని సంప్రదించామని కానీ.. అందుకు ఆయన నిరాకరించారని చీఫ్ జస్టిస్ తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశంపై ఏమనుకుంటున్నారో సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై పూర్తి అవగాహనతో ఉన్నామని … జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చీఫ్ జస్టిస్ ప్రకటించారు.
మరో వైపు తెలంగాణలో పర్యటించిన మానవ హక్కుల కమిషన్…, తాము సేకరించిన వివరాలన్నింటినీ… సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌కు గురైన నలుగురిలో ముగ్గురు మైనర్లన్న ప్రచారం జరుగుతోంది. దాంతో.. ఈ కేసు మరింత తీవ్ర తరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్కౌంటర్ విషయంలో ప్రజామోదం లభించినప్పటికీ..చట్టపరమైన ఆమోదం మాత్రం అంత తేలిగ్గా లభించే అవకాశం కనిపించడం లేదు.