అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఏపీ ప్రభుత్వ వాదనకు సుప్రీంకోర్టులోనూ పెద్దగా స్పందన కనిపింలేదు. గతంలో అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ఐపీసీలో లేదని.. అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణను హైకోర్టు కొట్టి వేసింది. అందరూ ఇష్టపూర్వకంగా అమ్మకాలు.. కొనుగోలు చేసినప్పుడు అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా అవుతుందని గతంలో హైకోర్టు ప్రశ్నించింది. అసలు చట్టంలోనే లేదని హైకోర్టు చెప్పడంతో.. ఏపీ ప్రభుత్వం.. తమ ఆరోపణలపై పునం పరిశీలన చేసుకోకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేసి.. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు అనుమతి ఇవ్వాలని కోరింది.
అయితే సుప్రీంకోర్టు ధర్మాసనానికి .. ప్రభుత్వం తరపు న్యాయవాదిని సూటిగా ప్రశ్నలు సంధించింది. రాజధానికి సంబంధించిన సమాచారం.. తమ వారికి ముందుగా అందించి చంద్రబాబు భూములు కొనుగోలు చేయించారని.. ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. అయితే.. రాజధాని ఎక్కడ వస్తుందనేది బహిరంగ రహస్యమని.. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని ధర్మానసనం దవేను ప్రశ్నించింది. అసలు అమ్మిన వారు ఎవరైనా తమకు నష్టం జరిగిందని ఫిర్యాదు చేశారా.. అని ప్రశ్నించింది.
ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వ తరపు న్యాయవాది నీళ్లు నమిలారు. ఏం చెప్పాలో తెలియక.. వాదనలు వినిపించేందుకు మరింత గడువు కావాలని కోరారు. దీంతో గడువు ఇచ్చిన ధర్మాసనం.. తదుపరి వాయిదా కల్లా.. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. అప్పుడే…సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో సిట్ విషయంలో దాఖలైన పిటిషన్‌కు దీన్ని కూడా జత చేయాలని దవే కోరారు. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు.