హైదరాబాద్: ముంబాయి పేలుళ్ళ కేసులో ఉరి శిక్ష విధించబడిన దోషి యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈనెల 30న అతనికి ఉరిశిక్ష అమలు జరగనున్న సంగతి తెలిసిందే. 250మందికి పైగా ప్రాణాలను బలి తీసుకున్న 1993నాటి ముంబాయి పేలుళ్ళ కేసులో పట్టుబడిన యాకూబ్ నేరం రుజువు కావటంతో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. యాకూబ్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీం కోర్టు ఈ నెల 21న కొట్టిపారేసింది. అయితే అతనికి క్షమాభిక్ష పెట్టాలని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. వీరిలో బీజేపీ ఎంపీ శతృఘ్నుసిన్హా, కాంగ్రెస్ నాయుకుడు మణిశంకర్ అయ్యర్, సీపీఎం నాయకుడు సీతారామ్ ఏచూరి, సుప్రీమ్ కోర్టు న్యాయవాది రాంజెఠ్మలాని, నటుడు నజీరుద్దీన్ షా, దర్శకుడు మహేష్ భట్ ఉన్నారు. మరోవైపు నటుడు సల్మాన్ ఖాన్ యాకూబ్ ఉరిని వ్యతిరేకిస్తున్నట్లు ట్వీట్ చేయటంతో పెద్ద వివాదం చెలరేగటం, ఆ వ్యాఖ్యలను అతను ఉపసంహరించుకోవటం తెలిసిందే.