ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది. కత్తిరించిన జీతాలపై వడ్డీ చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కరోనా కారణం చూపి రెండు నెలల పాటు సగం కోత విధించిన జీతాలను పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. దీనికి రెండు నెలల గడువు ఇచ్చింది. అయితే రెండు నెలల గడువు లోపల.. కత్తిరించిన మొత్తానికి వడ్డీ కాదు.. అసలు కూడా ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించలేదు. కానీ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున.. కత్తిరించిన జీతాలపై వడ్డీ చెల్లించలేమని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వడ్డీ చెల్లించాలన్న ఆదేశాలపై స్టే విధించింది. విచారణను వాయిదా వేసింది. పన్నెండు శాతం వడ్డీ చెల్లించడాన్ని ప్రభుత్వం నామోషీగా భావించింది. అయితే.. అసలు చెల్లింపులు కూడా.. రెండు వాయిదాల్లో చెల్లించాలన్న విషయాన్ని ఏపీ సర్కార్ పాటించడం లేదు. ఐదు వాయిదాల్లో ఇస్తామంటూ.. ఉద్యోగ సంఘాలను పిలిచి.. చెప్పినట్లుగా.. ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగా చెల్లింపులు ప్రారంభించారో లేదో క్లారిటీ లేదు.
కానీ.. వడ్డీ విషయంలో మాత్రం.. ఏపీ సర్కార్కు కాస్త రిలీఫ్ వచ్చినట్లుగానే అయింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ సర్కార్కు.. ఎంతో కొంత మిగిలే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో కోర్టుల్లో వరుస దెబ్బలు తింటూ… తమకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులన్నింటికీ.. ఏదో ఓ భాష్యం చెప్పుకుంటున్న వైసీపీ.. అనుకూలంగా వస్తున్న తీర్పులపై మాత్రం.. సంతోషం వ్యక్తం చేస్తుంది.