గవర్నర్‌ను కలవాలంటూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఏపీ సర్కార్ తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టి వేస్తూ.. నిమ్మగడ్డను మళ్లీ నియమించాలని హైకోర్టు ఆదేశిచింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో నిమ్మగడ్డ ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ ప్రారభించిన హైకోర్టు.. ముందుగా నిమ్మగడ్డ.. గవర్నర్‌ను కలవాలని ఆదేశించింది. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణకు స్టే కోసం.,. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇంతకు ముందు.. అసలు నిమ్మగడ్డను పునర్నియమించాలన్న ఆదేశాలపైనే స్టేకు వివిధ రూపాల్లో మూడు సార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎదురు దెబ్బలు తిన్నది ప్రభుత్వం. తాజాగా… మరోసారి చుక్కెదురు అయినట్లయింది.
కేసు విచారణ సందర్భంగా.. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయం తమకు తెలుసని అందుకోసం స్టే ఇవ్వడం లేదని తెలిపింది. గవర్నర్ లేఖ పంపినా… నిమ్మగడ్డను నియమించకపోవడం దారుణమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసి… హైకోర్టు చెప్పినట్లుగా వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రం మేరకు.. గవర్నర్ కూడా.. ప్రభుత్వానికి.. సూచనలు చేశారు. నిమ్మగడ్డను మళ్లీ నియమించాలన్నారు. అయితే ఏపీ సర్కార్ మాత్రం.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టులో స్టే వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉంది. కానీ సుప్రీంకోర్టులో తాజా ప్రయత్నం కూడా బెసిడి కొట్టింది. ఇప్పుడు ఏపీ సర్కార్ పెద్దలు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అసలు నిమ్మగడ్డ నియామకమే చెల్లదంటూ.. ఏపీ సర్కార్ వేసిన పిటిషన్లు… సుప్రీంకోర్టులోనే విచారణలో ఉన్నాయి. నిమ్మగడ్డను మళ్లీ నియమించడానికి ససేమిరా అంటున్న ఏపీ సర్కార్… అందు కోసం.. రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా ఎదిరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో… సుప్రీంకోర్టులో ఉన్న మరో పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ ఆయన నియమాకాన్ని చేపట్ట కూడదనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. అది కోర్టు ధిక్కారం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి.., నిమ్మగడ్డను.. మళ్లీ నియమించక తప్పని పరిస్థితికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. లేకపోతే రాజ్యాంగధిక్కరణ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు ఏం సర్కార్ ఏం చేస్తుందన్నది కీలకంగా మారింది..!