హైదరాబాద్: మాకు ఓటేస్తే ఆకాశంనుంచి చందమామను కిందకు తీసుకొస్తాం, కాలుకదపకుండా అన్నీ కూర్చున్నచోటికే తీసుకొస్తాం అంటూ రాజకీయ నాయకులు ఎన్నికలకుముందు నోటికొచ్చినట్లు హామీలు గుప్పించటం తెలిసిందే. దీనికి ఏ పార్టీ మినహాయింపుకాదు. అన్ని పార్టీలూ తమతమ ఎన్నికల ప్రణాళికలలో ఓటర్లకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించేస్తుంటాయి. రాజకీయ పార్టీల ఈ హామీలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రణాళికలలో చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం మోసం కిందకు రాదని వ్యాఖ్యానించింది. మ్యానిఫెస్టోలలో చేసిన హామీలను అధికారంలోకొచ్చిన పార్టీలు ఖచ్చితంగా అమలు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషన్(పిల్)పై ఛీఫ్ జస్టిస్ దత్తు, జస్టిస్ అమితవ్ రాయ్లతోకూడిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. రాజకీయపార్టీలు బూటకపు వాగ్దానాలు చేస్తున్నాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవటంలేదని పిటిషనర్ వాదించారు. ఈ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఆ హామీలను తప్పనిసరిగా అమలు చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరారు. ఎన్నికల సందర్భంగా హామీలను ఇవ్వటంపై అన్ని పార్టీలతో చర్చించి మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీమ్ కోర్ట్ 2013లో ఎన్నికల సంఘానికి సూచించిన విషయాన్ని పిటిషనర్ కోర్టుకు గుర్తుచేశారు.