పంచాయతీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఆవేశపడింది. ఆ ఆవేశంలో తప్పులు చేసింది. తప్పుల తడకగా సవాల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటిషన్ను విచారణ క్రమంలో పెడదామనుకున్న సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి కూడా… ఆ పిటిషన్ ఏంటో అర్థం కాలేదు. వెంటనే… ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు ఆ పిటిషన్ను వెనక్కి ఇచ్చేశారు. పిటిషన్ను అర్థమయ్యేలా తప్పులు లేకుండా… మరోసారి దాఖలు చేయాలని సూచించారు. తప్పులు సరి చేయడానికి ఏపీ ప్రభుత్వ సీనియర్ లాయర్లు తంటాలు పడుతున్నారు. తప్పులు సవరించి మళ్లీ పిటిషన్ వేస్తే ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియని పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రకాల సమీకరణాల్ని లెక్కలోకి తీసుకుని .. పదుల సంఖ్యలో న్యాయవాదుల్ని నియమించుకుంది. ఢిల్లీలో ప్రత్యేకంగా పిటిషన్లు వేయడానికే న్యాయవాదులున్నారు. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా.. ఇప్పుడు అనధికారికంగా న్యాయవ్యవహారాలన్నీ చూస్తున్నారు. ఆయన కుమారుడు స్వయంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలో ఉన్నారు. ఇంత పకడ్బందీ యంత్రాంగం ఉన్నప్పటికీ.. ఓ పిటిషన్ ని తప్పుల తడకగా వేయడం ఏమిటన్నది వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఉన్న పళంగా హైకోర్టు తీర్పును.. సుప్రీంకోర్టులో సవాల్ చేసి స్టే తీసుకు రాకపోతే.. నోటిఫికేషన్ విడుదలైపోతుంది. అది ఇరవై మూడునే తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇప్పటికే ఎస్ఈసీ షెడ్యూల్ ఇచ్చింది. దీని ప్రకారం.. ఆ షెడ్యూల్ వచ్చేస్తుంది. శనివారం ఆ షెడ్యూల్ వస్తే.. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా అలాంటి పిటిషన్ను అనుమతించదని పాత తీర్పులు చెబుతున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆపాలన్నా.. కొనసాగించాలన్నా.. అది ఎన్నికల కమిషన్ అధికారమే కానీ.. కోర్టులు ఎప్పుడూ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు . దీంతో ఏపీలో ఎన్నికలు ఖాయమని చెప్పుకోవచ్చంటున్నారు.