హైదరాబాద్: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో సుప్రీం కోర్ట్ ఇవాళ సంచల తీర్పు వెలువరించింది. 2 లీటర్ల కంటే ఎక్కువ పరిమాణం గల ఇంజన్లు ఉన్న ఎస్యూవీ, లగ్జరీ నూతన వాహనాలను మార్చి 31వరకు రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులను ఆదేశించింది. పదేళ్ళకంటే ఎక్కువ వయసున్న డీజెల్ వాహనాలను రోడ్లపైకి అనుమతించొద్దని కూడా నిర్దేశించింది. ఈ ఆదేశాలు టయోటా ఇన్నోవా, మహేంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, టాటా సఫారీ, సుమో, మిత్సుబిషి పెజేరో, ఫోర్డ్ ఎండీవర్, ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ వాహనాల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ వాహనాలన్నీ రెండు లీటర్లపైనే పరిమాణంగల ఇంజన్లున్నవే. ఢిల్లీలో ఇటీవల వాయు కాలుష్యం పెరిగిపోవటం, దీనిని నియంత్రించటంకోసం కేజ్రీవాల్ ప్రభుత్వం జనవరి 1 నుంచి సరి సంఖ్య వాహనాలు, బేసి సంఖ్య వాహనాలు రోజు విడిచి రోజు రోడ్లపైకి వచ్చేటట్లుగా ఆదేశాలు జారీచేయటం తెలిసిందే. దీనికితోడు నిన్న సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఢిల్లీలో వాయు కాలుష్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని గాలిని కాలుష్యం చేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాహనాలను ధనవంతులు కొనుగోలు చేయనీయకూడదని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ప్రస్తుతం 85 లక్షల వాహనాలు ఉన్నాయి… ప్రతిరోజూ 1,400 కొత్త కార్లు రోడ్లపైకి వచ్చిచేరుతున్నాయి.