సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ఓ మహిళ చట్టబద్దమైన వివాహబంధంలో ఉన్నప్పుడు పుట్టిన బిడ్డకు తండ్రిగా ఆమె భర్త మాత్రమే ఉంటారని స్పష్టం చేసింది. వివాహేతర బంధం వల్ల పుట్టినా సరే ఆ తండ్రి గా అతనినే గుర్తిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆసక్తికరంగా మారాయి.
కేరళకు చెందిన ఓ మహిళ పెళ్లి తర్వాత పదేళ్ల వరకూ భర్తతో కలిసి ఉంది. ఆ సమయంలో ఓ బిడ్డ పుట్టాడు . కానీ ఈ బిడ్డ పుట్టింది వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తి వల్ల. అయితే రికార్డుల్లో మాత్రం తండ్రి పేరును తన భర్త పేరును చేర్పించింది. తర్వాత భర్తతో విడాకులు తీసుకుంది. తన బిడ్డ తండ్రి అతను కాదని.. తండ్రి పేరు మార్చారని మున్సిపల్ అధికారులకు ధరఖాస్తు పెట్టుకుంది. కావాలంటే డీఎన్ఏ రిపోర్టులు ఇస్తామని చెప్పింది. కానీ అధికారులు అంగీకరించకపోవడంతో కోర్టుల్లో న్యాయపోరాటం చేసింది.
చివరికి సుప్రీంకోర్టు కూడా డీఎన్ఏ టెస్టులు చేయించుకుంటామన్న ఆ తల్లి, కొడుకుల విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది. చట్టబద్దమైన వివాహ బంధంలో ఉన్నప్పుడు వివాహేతర బంధాల ద్వారా పిల్లలు పుట్టినా తండ్రిగా భర్త పేరే ఉంటుందని.. మార్చుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. భారతీయ చట్టాలు అందుకు అంగీకరించవని స్పష్టంచేసింది. మారుతున్న సమాజ పోకడల కారణంగా సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది.