కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపై రెండేళ్ల పాటు విధించిన సూరత్ కోర్టుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీకి దిగువ కోర్టు శిక్ష విధించిన తర్వాత వెంటనే.. ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఇల్లు ఖాళీ చేయించారు. తనకు విధించిన శిక్షపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే…అక్కడా ఆయనకు ఊరట లభించలేదు. చివరికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని తిరిగి పొందుతున్నారు.
నాలుగేళ్ల కిందట కర్ణాటకలో దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందని చేసిన వ్యాఖ్యలకు గుజరాత్ లోని పూర్ణేష్ మోదీ అనే బీజేపీ ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది. తన ఇంటి పేరు కూడా మోదీనే కాబట్టి.. తనను కూడా దొంగ అన్నారని భావించి.. తన కమ్యూనిటీ మొత్తాన్ని అవమానించారని కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగి… రాహుల్ గాంధీ అదానీ అంశంపై గళమెత్తుతున్న సమయంలో… హుటాహుటిన తీర్పు వచ్చింది. అంతే వేగంగా ఆయనపై అనర్హతా వేటు వేయడం వంటివి జరిగిపోయాయి. ఇదంతా మార్చిలో జరిగింది.
రాహుల్ పై అనర్హతా వేటు వేసినా ఈసీ మాత్రం ఉపఎన్నికలు పెట్టే ఆలోచన చేయలేదు. రాహుల్ గాంధీ అన్ని రకాల న్యాయపరమైన అంశాలను ఉపయోగించుకున్న తర్వాత ఎలాంటి చాయిస్ లేకపోతే అప్పుడు ఉపఎన్నికలు పెట్టాలనుకున్నారు. ఇప్పుడు స్టే విధించడంతో ఉపఎన్నికల అవసరం ఉండదు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.