ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వీటిని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తైన సందర్బంగా ఈ తీర్పు వెలువరించింది.
ఎలక్టోరల్ బాండ్ల చట్టంలో ఏముంది ?
అధికారంలో ఉన్న పార్టీలు క్విడ్ ప్రో కో ద్వారా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసి వాటి దగ్గర నుంచి లంచం రూపంలో పార్టీ ఫండ్ తీసుకుంటున్నాయి. ఇది నేరం కాదు. చట్టబద్దమైన పనిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రదాని మోదీ ప్రభుత్వం తేల్చింది. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఓ చట్టం తీసుకు వచ్చింది. ఈ బాండ్స్ ఎవరైనా కొని రాజకీయ పార్టీలకు ఇవ్వొచ్చు. ఎవరు కొన్నారు..ఎంత కొన్నారు అన్న వివరాలేమీ బయటకు రావు. అంతా రహస్యం. ఆ బాండ్లు కొనడానికి డబ్బులు నీతిగా సంపాదించారా.. నిజాయితీగా సంపాదించారా అన్న సంగతి కూడా చెప్పాల్సిన పని లేదు. పోనీ పన్నులైనా కట్టారా అన్నది కూడా చెప్పాల్సిన పని లేదు. వీటి వల్ల సమాచారం అందరికీ రహస్యం కాదు… ప్రభుత్వంలో ఉన్న వారికి తెలిసిపోతుంది. అంటచే తమకు మాత్రమే విరాళాలు వచ్చి ఇతర పార్టీలను ఆర్థికంగా కుంగదీసే ప్లాన్ కూడా ఉందన్నమాట.
బీజేపీ పంట పండించిన ఎలక్టోరల్ బాండ్లు
లక్టోరల్ బాండ్ల ద్వారా తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వేల కోట్లు విరాళాలు సమీకరించుకుంది. మార్చి 2018లో తొలిసారి ఎలక్టోరల్ బాండ్లను విక్రయించడం మొదలుపెట్టారు. కేవలం స్టేట్ బ్యాంక్ ఇండియాలో మాత్రమే ఆ బాండ్లను విక్రయిస్తారు. 2021లో ఇలా పొందిన బాండ్ల సొమ్ములో 60 ఒక్క భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే జమ అయ్యాయి. 2022-23లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.1300 కోట్ల నిధిని సమకూర్చుకోగలిగింది 2022 23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.2120కోట్లు కాగా, అందులో 61 శాతం ఎలెక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయి.
ఎనిమిదేళ్లుగా సుప్రీంకోర్టులో విచారణ
ఎలక్టోరల్ బాండ్లపై విచారణ సుప్రీంకోర్టులో ఎనిమిదేళ్ళుగా పెండింగ్లో ఉంది తమకు వచ్చిన బాండ్ల వివరాలను వెంటనే ఎన్నికల సంఘానికి సమర్పించాలని 2019 ఏప్రిల్లో ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించారు. ఎట్టకేలకు విచారణ పూర్తి చేసుకుని తీర్పు వెలువరించారు.