సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తారా? ఇది ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశం లేదు. ఈ నిషేధం ఎందుకంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ ఆలయంలో మహిళల పట్ల వివక్ష ఎందుకంటూ సుప్రీం కోర్టు ఇప్పటికే చాలా సార్లు ఆలయ కమిటీని ప్రశ్నించింది. దైవ దర్శనం చేసుకునే హక్కును మహిళల నుంచి ఎందుకు దూరం చేస్తున్నారని కూడా ప్రశ్నించింది.
కోర్టు త్వరలో ఏ తీర్పు చెప్తుందో తెలియదు. అయితే, కేరళ ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇలాంటి సున్నితమైన విషయాల్లో కోర్టు తీర్పుల కంటే ఏకాభిప్రాయం ముఖ్యమని కేరళ మంత్రి కె. సురేంద్రన్ శనివారం చెప్పారు.
ఓ వైప ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి రెఫరెండం జరపడంతో పాటు మరో ప్రయత్నం కూడా జరగబోతోంది. అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుంటారు. మతపరమైన విషయాల్లో ప్రజల సెంటిమెంటుకు విఘాతం కలగని విధంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది.
ఆలయ పవిత్రత అనే కారణంతో మహిళల ప్రవేశంపై ఆలయ కమిటీ ఆంక్షలు విధించింది. అయితే, దేశంలోని దాదాపు అన్ని ఆలయాల్లోకీ మహిళలు ప్రవేశిస్తున్నారు.
నెలసరి సమయంలో మహిళలు ఏ గుడికీ వెళ్లరనే విషయం శబరిమల ఆలయ నిర్వాహకులు గుర్తించాలనేది మహిళా సంఘాల వాదన. ఈ విషయంలో మహిళలకు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వారంటున్నారు. ఇతర ఆలయాల్లో లేని పవిత్రత సమస్య శబరిమలలో మాత్రమే ఎలా ఉంటుందనేది వారి ప్రశ్న.
శబరిమల ఆలయానికి కేరళ మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లోని భక్తులు వెళ్తుంటారు. సంక్రాంతి సమయంలో లక్షల మంది అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప దీక్ష అనేది చాలా ప్రాచుర్యం పొందింది. ఒకవేళ మెజారిటీ ప్రజలు మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరితే ప్రభుత్వం ఆ ప్రకారమే నిర్ణయం తీసుకుంటుందా? ఒక వేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే అది పెద్ద సంచలనం అవుతుంది.