ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులపై ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలన్న అంశంపై అమికస్ క్యూరీ హన్సారియా సుప్రీంకోర్టుకు మరో నివేదిక సమర్పించారు. అన్ని హైకోర్టులు ఇచ్చిన వివరాల సారాంశంతో నివేదిక సిద్ధం చేశారు. నేతలపై పెండింగ్ కేసుల వివరాలను కేంద్రం ఇవ్వలేదని హన్సారియా తన నివేదికలో తెలిపారు. ఎక్కువ హైకోర్టులు నోడల్ ప్రొసిక్యూషన్ అధికారిని ఇంకా నియమించలేదని అమికస్ క్యూరీ తన నివేదికలో తెలిపారు. అమికస్ క్యూరీ నివేదిక.. హైకోర్టుల నుంచి అందిన సమాచారం.. తదితర అంశాల ఆధారంగా బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. గతంలో ఓ సారి అమికస్ క్యూరీ నివేదిక సమర్పించారు. మరిన్ని వివరాలు కావాలని ధర్మాసనం ఆదేశించింది.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు సంబంధించి.. కొన్ని కీలకమైన.. మౌలికమైన సమస్యలను న్యాయమూర్తులు కొంత మంది లేవెనత్తారు. మద్రాస్ హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు.. ప్రత్యేక కోర్టుల చట్టబద్ధతను ప్రశ్నించారు. ఎక్కడైనా నేరం కేంద్రంగా ప్రత్యేక కోర్టు ఉంటుందని.. నిందితుడు కేంద్రంగా ఉండదని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి మౌలికమైన అనుమానాలు.. సందేహాలపైనా అమికస్ క్యూరీ తన అభిప్రాయాలను అఫిడవిట్లో సమర్పించినట్లుగా తెలుస్తోంది.
ప్రజాప్రతినిధులపై కేసులను ఏడాదిలోపు విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపధ్యంలో విధివిధానాల ఖరారుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టుపైనే నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. న్యాయవ్యవస్థపైనే దాడికి దిగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని సుప్రీంకోర్టు ఈ ప్రజాప్రతినిధుల కేసుల వ్యవహారాన్ని తేల్చాల్సి ఉంది. నేరుగా రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అంశమైనందున చాలా సమస్యలు వస్తాయని .. వాటిని సుప్రీంకోర్టు ఎలా ఎదుర్కొంటుందోనన్న ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోంది.