మే9 వ తేదీన సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ జరగనుంది. ఈ కేసులు లిస్ట్ కావడంతో అందరిలోనూ అటెన్షన్ వ్యక్తమయింది. ఇంత త్వరగా ఎలా విచారిస్తారన్న ప్రశ్న ఉదయించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని అందుకే విచారిస్తోందని చెప్పుకున్నారు. అమరావతి కేసుల విచారణకు లిస్ట్ అయిన మాట నిజమే కానీ..అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఈ కేసుకు సంబంధించి చనిపోయిన పిటిషనర్స్ స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలంటూ రైతులు ఎల్ఆర్ ఆప్లికేషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మే 9న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
పిటిషనర్లుగా ఉన్న కొందరు రైతులు ఏళ్ల తరబడి చనిపోయారని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చనిపోయిన రైతుల ప్రతినిధులను పిటిషనర్లుగా అనుమతించాలని కోర్టును కోరారు. . ఆ మేరకు రైతుల ప్రతినిధులకు నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులకు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వం పంపకపోవడంతో రైతుల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. దీనిపైనే విచారణ చేయనున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో జూలై 11న విచారణ చేస్తామని గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ విచారణ విషయంలో ఎలాంటి మార్పు లేదు. గత విచారణ సమయంలోనే అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు .. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు తెలిపింది.