జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి హెటెరోపై దాఖలైన కేసులో దాచేస్తే దాగని సత్యాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయం పడింది. అక్రమాస్తుల కేసుల్లో తమపై దాఖలైన కేసును క్వాష్ చేయాలంటూ హెటెరో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. సీబీఐ పక్కాగా చార్జిషీటు దాఖలు చేసిందని.. అందులో ఉన్న సాక్ష్యాలన్నీ దాచేస్తే దాగని సత్యాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో హెటెరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. గత ఏడాది నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు హెటిరో గ్రూప్‌ను కేసు నుంచి తొలగించేందుకు నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో హెటిలో సవాల్ చేసింది.
అరబిందో, హెటిరో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూ కేటాయింపుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో సంస్థను నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. జగతిలో జగన్ ఒక్క రూపాయి కూడా పెట్టబడి పెట్టకుండానే ఇతరులతో రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారని సీబీఐ సాక్ష్యాలతో సహా చార్జిషీటు దాఖలుచేసింది. జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది.
హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే! జగన్ కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్ ఏసియా, సండూర్ పవర్ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు. అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్ రాబట్టారు. అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం.. అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయని సీబీఐ వాదించింది. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితులుగా కొంతమందిని చేరిస్తే పర్వాలేదు కానీ.. మొత్త కంపెనీని చేర్చడమేమిటని హెటిరో తరపు న్యాయవాది వాదించారు. ఆ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.