కేరళ రాష్ట్రంలో క్రమంగా మద్య నిషేధం అమలుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని మద్యం వ్యాపారులు మొదట హైకోర్టులో తరువాత సుప్రీం కోర్టులో సవాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రెండు చోట్ల వారికి ‘చుక్కె’దురయింది. కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యంపాలసీ ప్రకారం ఫైవ్ స్టార్ హోటల్స్ లో తప్ప బయట ఎక్కడా బార్లలో మద్యం అమ్మకాలు నిషేదించబడ్డాయి. మద్యనిషేధం అమలు చేయాలనుకొన్నప్పుడు మళ్ళీ ఫైవ్ స్టార్ హోటల్స్ కి మినహాయింపునిస్తూ తమకే నిషేధం వర్తింపజేయడాన్ని తప్పు పడుతూ మద్యం వ్యాపారులు వేసిన పిటిషన్ ని విచారణకు స్వీకరించిన జస్టిస్ విక్రంజిత్ సేన్, జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేరళ ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్దించింది. మద్యం వ్యాపారుల తరపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహాత్గీతో సహా అనేక మంది ప్రముఖ న్యాయవాదులు వాదించినా ఫలితం లేకుండా పోయింది. మద్యనిషేదం కారణంగా నష్టపోతున్న మద్యం వ్యాపారులు అందరికీ ప్రత్యమ్నాయ ఏర్పాట్లను చేయవలసిందిగా సుప్రీం కోర్టు ధర్మాసనం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేరళ రాష్ట్రంలో రోజుకి రూ.30 కోట్లు విలువచేసే మద్యం అమ్ముడవుతుంటుంది. రాష్ట్రంలో మద్యనిషేధం అమలుచేయడం మొదలుపెట్టిన తరువాత రూ.4,000 కోట్ల ఆదాయం నష్టపోయింది. రాష్ట్రంలో సుమారు 700కి పైగా బార్లు మూతపడ్డాయి. గత ఆర్ధిక సం.లో కేరళ రాష్ట్రంలో రూ. 9,353.74 కోట్లు విలువ చేసే మద్యం వ్యాపారం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం కారణంగా మద్యం వ్యాపారులు, మద్యం ఉత్పత్తి సంస్థలు, వాటిలో పనిచేసే వేలాదిమంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక వారందరూ ఒత్తిడి పెంచడం తధ్యం. అది రాష్ట్రంలో రాజకీయాలను ప్రభావితం చేసి చివరికి అధికారం చేతులు మారాడానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు.