కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు దేశంలో ఓ కొత్త రాజకీయ వైపరీత్యాలకు దారి తీసే పరిస్థితి కనిపిస్తోందన్న అభిప్రాయం.. ఏర్పడుతోంది. పార్టీలు జారీ చేసే విప్లపైనే ఈ వైపరీత్యం ఏర్పడనుంది. సభకు హాజరు కావాలా వద్దా అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉండాలని కోర్టు తీర్పు చెప్పడంతో మరి పార్టీలు జారీ చేసే విప్ మాటేమిటనేది రాజకీయ పార్టీల సందేహం. కోర్టు ఉత్తర్వుల తర్వాత విప్ ప్రస్తావనే ఉండదని బీజేపీ నేత యడ్యూరప్ప పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఫిరాయింపుల చట్టం ఎందుకు వర్తించదని.. కాంగ్రెస్ నేత శివకుమార్ అంటున్నారు.
ఎవరినీ నిర్బంధించలేమని సుప్రీం కోర్టు చెప్పిందని… ఆ మాట .. విప్‌ను ఉల్లంఘించమని కాదని.. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు ఫిరాయింపుదారులను కాపాడేదిగా ఉందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూ రావు ఆరోపించారు. దీని వల్ల పార్టీ మారేవారికి అనేక అవకాశాలిచ్చినట్లవుతుందన్నారు ప్రత్యర్థులతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అవకాశం ఇస్తుందంటున్నారు. రాజీనామాలు ఆమోదం పొందడమో… అనర్హతా వేటు వేయడమే జరగలేదు కనుక.. వారు ఇంకా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నట్లే లెక్క. అప్పుడు విప్ అంశం కూడా కచ్చితంగా ప్రస్తావనకు వస్తుందని కాంగ్రెస్ నేతలంతుటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు… ఓ తీవ్రమైన రాజ్యాంగ సమస్యను ఆవిష్కరిస్తుదని.. కాంగ్రెస్ నేతలు గట్టిగానే వాదిస్తున్నారు.
మధ్యంతర తీర్పులో విప్ ప్రస్తావన లేకపోవడంతో భవిష్యత్తులో ఇతర అసెంబ్లీలోనూ ఇలాంటి ప్రశ్నలే తలెత్తితే ఏం చేయాలన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ ఫిరాయించాలనుకున్న ఎమ్మెల్యేలు కర్ణాటక కేసు తీర్పును సాకుగా చూసి తప్పించుకునే వీలుందని కొందరి వాదన. పార్టీకి దూరమైన వారు ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా జాప్యం చేసేందుకు కూడా ఇది బాగానే ఉపయోగపడుతుంది. అందుకే.. రాజకీయవర్గాల్లో సుప్రీంకోర్టు తీర్పు కలకలం రేపుతోంది.