భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు క్లిష్ట దశకు చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏ వ్యవస్థ అధికారాల్లో ఎవరు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ.. చాలా వేగంగా ఆయా వ్యవస్థలు సంయమనం పాటించడంతో పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ సారి కూడా అలాగే సర్దుబాటు చేసుకుంటారా లేక సమస్య పెద్దవుతుందా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇలా సర్దుబాటు చేసుకోవడంతోనే సమస్యలు పరిష్కారం కావు.. ఈ వివాదం లేవనెత్తిన అనేక మౌలిక ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంటుంది.
గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పు పై వివాదం
తమిళనాడు గవర్నర్ వ్యవహారశైలి విషయంలో అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టు.. గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తేల్చింది. గవర్నర్ అనుమతి నిరాకరించిన తర్వాత..రెండో సారి అదే బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తే గవర్నర్ ఆమోదం అవసరం లేదని..గెజిట్ జారీ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు పరిమితులు పెట్టింది. ఏ బిల్లు అయినా మూడు నెలల వరకు మాత్రమే అట్టి పెట్టుకోవాలని .. ఆ లోపు నిర్ణయం తీసుకోకపోతే .. ఆమోదం ఇచ్చినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది రాజ్యాంగంలో లేదు.
సుప్రీంకోర్టు పార్లమెంట్ అధికారాల్లో జోక్యం చేసుకుంటోందన్న ఉపరాష్ట్రపతి
సుప్రీంకోర్టు తీర్పుపై కొన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమయింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, గవర్నర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన రోజునే కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సుప్రీంకోర్టు తీర్పుపై, బిల్లులను ఆమోదించడానికి గవర్నర్కు గడువు విధించడం “అతిగా జోక్యం చేసుకోవడం” అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడా అదే మాట అంటున్నారు. పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాలను సుప్రీంకోర్టు తీర్పులుగా చెబుతోందని ఇక పార్లమెంట్ ఎందుకన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా.. తమ పార్టీ నేతలతో కాకుండా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితోనే మాట్లాడిస్తోంది. అంటే నేరుగా న్యాయవ్యవస్థతో ఢీకొట్టేందుకు సిద్దమయిందని అనుకోవచ్చు.
రాజ్యాంగం, చట్టాల ప్రకారమే తీర్పులు
అయితే సుప్రీంకోర్టు పరిధి పూర్తిగా రాజ్యాంగం, చట్టాల ప్రకారం పాలన, నిర్ణయాలు జరుగుతున్నాయా లేదా అన్నదాని వరకే పరిమితం కావాలి. ఫలానా విధంగా చట్టం ఉండాలని నిర్దేశించలేరు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ నిర్ణయమే అంతిమం అని ఉంది. సమయం పెట్టలేదు. దాన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయంలో పార్లమెంట్ లో చట్టం మార్పు చేయాల్సింది పార్టీలే. సుప్రీంకోర్టు చట్టంలో ఏముందో అంత వరకు మాత్రమే తీర్పులు ఇవ్వగలదు. గవర్నర్లు, రాష్ట్రపతులకు గడువు నిర్దేశించడం కూడా అలాంటిదేనన్న అభిప్రాయం ఉంది.
రెండు వ్యవస్థలపై అనేక ప్రశ్నలు
ఈ క్రమంలో దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన రెండు వ్యవస్థల తీరుపై ప్రజల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. రాజ్యాంగాన్ని దాటి రెండు వ్యవస్థలు ఎందుకు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఒక వ్యవస్థను..మరో వ్యవస్థ ఎందుకు ప్రశ్నించుకుంటోందని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం సద్దుమణిగిపోయినా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం దొరక్కపోవచ్చు.