జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు, జగన్ కేసుల విచారణ తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేశారు. విచారణలో ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అందుకని పిటిషన్ పై విచారణ ముగించాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.
అయితే తాము ఈ పిటిషన్ లపై విచారణ ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున మూడు నెలల గడువు ఇవ్వాలని, ఆ తరువాత పరిశీలన జరపాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. సమయం ఇచ్చి ఉపయోగం ఏంటి? ఫలితం ఎక్కడా కనిపిచడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. తాము బాధ్యులం కాదని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలపగా.. ఎవరు బాధ్యత వహిస్తారని తుషార్ మెహతాను సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. ఇన్నిసార్లు వాయిదాలు పడటం, ఇంతకాలయాపన జరగడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.
రాజకీయ దృక్పదంతో పిటిషన్ ను పిటిషనర్ ఇక్కడ దాఖలు చేశారని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నుంచి తనపై చర్యలు తీసుకున్నారని, గత మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని పిటిషనర్ పై నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రఘురామ రాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినందునే ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలు చేశారని అన్నారు. అయితే, జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ.. తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదు.. కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.