నిర్భయ కేసులో బాల నిందితుడు నిన్న విడుదలయ్యాడు. అతనిని విడుదల చేయవద్దని నిర్భయ తల్లి తండ్రులతో సహా అనేక మంది ప్రజలు, ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, అతను చట్ట ప్రకారం తన మూడేళ్ళ శిక్షా కాలం పూర్తి చేసుకొన్నందున అతని శిక్షను పోదిగించలేమని డిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. బాల నేరస్థుడి విడుదల పట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున అతని భద్రతను దృష్టిలో ఉంచుకొని, పోలీసులు అతనిని ఒక సచ్చంద సంస్థకు అప్పగించారు. డిల్లీ హైకోర్టు అతని నిర్బంధాన్ని పొడిగించడానికి అంగీకరించకపోవడంతో నిర్భయ తల్లితండ్రులు డిల్లీ మహిళా కమీషన్ ని ఆశ్రయించగా, ఆ సంస్థ చైర్ పర్శన్ స్వాతి నిన్న ఆర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
ఈ కేసు తీవ్రతను, ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకుర్, నిన్న అర్ధరాత్రి తరువాత సుమారు ఒంటి గంటన్నరకు జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్‌లతో అత్యవసరంగా తన నివాసంలోనే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. కానీ జస్టిస్ టి.ఎస్.ఠాకుర్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం కూడా డిల్లీ హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ బాల నేరస్థుడి విడుదలపై స్టే మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే అతనిని విడుదల చేయవద్దని కోరుతూ ఇప్పటికే దాఖలయిన ఒక పిటిషనుని ఈరోజు (సోమవారం) విచారించబోతున్నందున దానిపై తీర్పు నేడో రేపో వెలువరించే అవకాశం ఉంది. పురందేశ్వరి, కవిత వంటి అనేకమంది రాజకీయ మహిళా నేతలు ఆ బాల నేరస్తుడి వలన సమాజానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కనుక మరి కొన్నాళ్ళు అతనిని నిర్బందంలోనే ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.