కొంపలేం మునిగిపోవు… విచారణ దశలో ఉన్న వాటిపై బుల్డోజర్ పంపటం ఆపండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో విచారణ దశలో ఉన్న నేరగాళ్ల ఇండ్లు, కార్యాలయాలు, ఆస్తులపైకి బుల్డోజర్లు పంపటం, కూల్చేయటంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. అనధికారికంగా చేసే ఇటువంటి చర్యలను అక్టోబర్ 1వరకు ఆపాలని స్పష్టం చేసింది. విచారణ అయ్యే వరకు ఆగితే కొంపలేం మునిగిపోవు అంటూ వ్యాఖ్యానించింది.
ఈ నెలలోనే రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులపైనే ఆదేశాలిచ్చాం. బుల్డోజర్ చర్యలను హీరోయిజంగా చూపటం ఆపాలని, ముందస్తు అనుమతులు లేకుండా కూల్చివేతలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే, తాజా ఆదేశాలు ఫుట్ పాత్ ఆక్రమణలు, రోడ్డు విస్తరణ పనులు, నీటి వనరుల ఆక్రమణల విషయంలో కూల్చివేతలకు వర్తించవని… వీటిపై స్థానిక ప్రభుత్వాలు కూల్చివేతల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
యూపీలో బుల్డోజర్ జస్టిస్ పై నమోదైన ఓ కేసును విచారిస్తూ… దేశవ్యాప్తంగా పెరుగుతున్న బుల్డోజర్ జస్టిస్ పై జస్టిస్ గవాయ్, విశ్వనాథన్ ల బెంచ్ తాజా ఆదేశాలను జారీ చేసింది.