గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ సమీక్షించి తప్పులు ఉంటే కేసులు నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సెప్టెంబర్‌లో హైకోర్టు ఇచ్చిన స్టే పై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, సిట్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. స్టే పై తదుపరి విచారణలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అమరావతి భూముల విషయంలో సీబీఐ దర్యాప్తు కోరామని కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
హైకోర్టు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో, దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలపై స్టే విధిచింది. ప్రభుత్వం చెబుతున్న నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించే ఆధారాలేవీ లేవని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎప్పుడైనా ఫిర్యాదు చేశాకే నేరం నమోదవుతుందని.. కానీ ఇక్కడ నేరం నమోదు కావడానికి ముందే దర్యాప్తు చేయడంతో పాటు ఆయా నేరాలను విభాగాలుగా మార్చడం దగ్గర్నుంచి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థించడం వంటివన్నీ లోపభూయిష్టమేనని హైకోర్టు ఆక్షేపించింది.
ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశాక దర్యాప్తు చేస్తారు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా గత ప్రభుత్వంలోని కొంతమందిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో సిట్ ఏర్పాటు చేశారని పిటిషనర్లు వాదించారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఆ జీవోలను రద్దు చేయాలని వారు కోరారు. నాలుగు వారాల తర్వాత సుప్రీంకోర్టులో జరిగే విచారణతో ఈ సిట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.