సుప్రియా రెడ్డి ఇప్పుడీ పేరు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్, టూరిజం శాఖ, రుషికొండ ప్యాలెస్ వంటి వ్యవహారాల్లో అదే పనిగా వినిపిస్తోంది. ఈమె కారణంగా చాలా మంది ఐఎఎస్లపై కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ జల్సా ప్యాలెస్ల కోం పని చేసింది.. బిల్లులు చేయించుకుంది ఈమే. డబ్బులు డ్రా చేసింది కానీ లిఖిత పూర్వక బిల్లులు మాత్రం సమర్పించలేదు. ఇప్పుడీ విషయం ఆర్ అండ్ బీ, టూరిజం శాఖల్లో సంచలనం అవుతోంది.
జీవీ శ్రీనాథరెడ్డి అనే సలహాదారు భార్య, వైఎస్ అనిల్ రెడ్డి అనే జగన్ రెడ్డి సోదరుడు సమీప బంధువు సుప్రియారెడ్డి ఇంటీరియర్ పనుల పేరుతో జగన్ ఇళ్ల నిర్వహణ ఇచ్చేశారు. ఆమె తాడేపల్లి క్యాంప్ ఆఫీసు కోసం.. అరవై , డెభ్బై కోట్ల వరకూ ఖర్చు పెట్టించారు. మరో రెడ్డిని కాంట్రాక్టర్ గా పెట్టి ఫలానా పనులు చేశారు.. డబ్బులిచ్చేయాలని ఆదేశాలిచ్చేవారు. ఇవ్వకపోతే సీఎంవో ఆఫీసు నుంచి ఉన్నతాధికారులు ఫోన్లు చేసి బూతులు తిట్టేవారు. సీనియర్ ఆఫీసర్ కృష్ణబాబు కూడా ఇలా చేసిన వారిలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలోనూ పోస్టింగ్ పొందిన ప్రద్యుమ్న కూడా ఈ తప్పుల్లో భాగస్వామేనని అధికారవర్గాలు చెబుతున్నాయి.
రుషికొండ పాపంలో అత్యధిక ఖర్చు మొత్తం సుప్రియా రెడ్డి ఖాతాకే చేరింది. ఏమేమి కొనాలి.. ఏ దేశం నుంచి లగ్జరీ వస్తువులు దిగుమతి చేయాలన్నది మొత్తం ఆమె ప్లానే. ఓ రకంగా చెప్పాలంటే డబ్బులు ఆమెకు చేరితే… ఇంటీరియర్ మొత్తం పూర్తి చేసింది. రుషికొండ భవనం పేరుతో ఆమె రెండు, మూడు వందల కోట్లు వెనకేసుకున్నారన్న చర్చ నడుస్తోంది. ఇంకా ఆర్ అండ్ బీ , టూరిజం వంటి చోట్ల.. ఆమె పెట్టుకున్న ఊరూపేరు లేని కంపెనీతో పనులు చేయించి డబ్బులు చెల్లించారు. తవ్వేకొద్దీ సుప్రియా రెడ్డి ఖాతాలో కోట్లకు కోట్లు కనిపిస్తూండటంతో.. మొత్తం గుట్టు బయట పెట్టేందుకు సిద్ధమయ్యారు. విజిలెన్స్ తో విచారణ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.