పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించి సరిగ్గా రెండు నెలలైంది. ఆయన అడిగిన 50 రోజుల గడువు ముగిసింది. ఇంకా పరిస్థితి పూర్తిగా కుదుట పడలేదు. మరోవైపు దేశం డిజిటల్ లావాదేవీల దిశగా అడుగులు వేయాంటూ మోడీ ప్రభుత్వం ముమ్మర ప్రచారం చేస్తోంది. అయితే ఇందుకు అనువైన వాతావరణం కల్పించడంలో విఫలమవుతోంది.
ఆన్ లైన్, డిజిటల్, క్యాష్ లెస్… పేరు ఏదైనా డబ్బుతో కాకుండా మరోవిధంగా లావాదేవీలు చేయడం. కానీ బ్యాంకులు అడ్డగోలు చార్జీలు వడ్డిస్తున్నాయి. ఒక బ్యాంకు నుంచి మరో సంస్థ పేమెంట్ యాప్ కు డబ్బులు బదిలీ కావడం కష్టంగా ఉంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తనకిష్టమైన రూల్ప్ విధిస్తోంది. అన్నిటికీ మించి, పెట్రోల్ బంకుల్లో కార్డు స్వైప్ చేస్తే ప్రతి లావాదేవీకి 1 రూపాయి లెవీ వసూలుచేయాలని బ్యాంకులు నిర్ణయించాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో నగదు చెలామణి తగ్గింది. బంకుల్లోకార్డు ద్వారా బిల్లు చెల్లించడం పెరిగింది. కాబట్టి ఆ లావాదేవీలపై చార్జీలు ఉండకూడదు. మరి బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకునే వరకూ మోడీ ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కాదు. పైగా ఈ చార్జీలకు నిరసనగా బంకుల్లో సోమవారం నుంచి కార్డులు అంగీకరించకూడదని నిర్ణయించారు. అంటే, జేబులో డబ్బుంటేనే బంకుకు వెళ్లాలి. ఇది పెద్ద సమస్యే.
ఇప్పటికీ బ్యాంకుల ఏటీఎం కార్డుల వాడకంపై పరిమితి ఉంది. ఇన్ని లావాదేవీలు దాటితే చార్జీల మోత అనే విధానం మళ్లీ అమల్లోకి వచ్చింది. అంతే కాదు, డిజిటల్ చెల్లింపులు జరిపే పలు సంస్థలు చార్జీల మోత మొదలుపెట్టాయి. ఇన్ని అడ్డంకుల మధ్య జనం ఆన్ లైన్ కు ఎలా అలవాటు పడతారు? చెప్పడం కాదు, చేయడం ముఖ్యం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆన్ లైన్ లావాదేవీలపై ఏ చార్జీలు ఉండని విధంగా నిబంధనలు ప్రకటిస్తేనే అందరికీ మేలు. లేకపోతే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవు.