ఎవరు చెప్పారు సూర్యుడు తూర్పున మాత్రమే ఉదయిస్తాడని!
ఏం పడమర దిక్కు పాపం చేసుకుందా?
అందుకే కాబోలు.. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత నమ్మిన బంటుగా, ఒక రకంగా చెప్పాలంటే ఆయన కంటి పాపలా, కాలి చెప్పులా … అన్ని రకాలుగానూ ఆయనకు విశ్వసనీయుడైన సేవకుడిగా కొన్ని సంవత్సరాల తరబడి సేవలు అందించిన ‘సూరీడు’ అలియాస్ సూర్యనారాయణరెడ్డి ఇప్పుడు చంద్రబాబు కోటలో ప్రత్యక్షం అయ్యాడు. దీంతో సాధారణంగా తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమర దిక్కున ఉదయించడం వంటి పరిణామం ఇది అని అందరూ నివ్వెరపోతున్నారు.
‘సూరీడు’గా అందరూ పిలుచుకునే సూర్యనారాయణరెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాలో తాను కూడా ఒక అధికార కేంద్రంలాగానే చెలాయించారనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్‌కు సొంత మనిషి అయిన సూరీడు లేకుండా వైఎస్ కదలికలు ఉండేవి కాదు. ఆయన కాళ్లకు చెప్పులు తొడగడం దగ్గరినుంచి భోజనాలు వడ్డించడం వరకు అన్ని పనులు సూరీడే చేయాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ వేళకు ఏ టాబ్లెట్ వేసుకోవాలో.. ఆయనకు గుర్తుండకపోయినా సరే.. అన్నీ తనే చూసుకుంటూ.. టూర్లలో ఉన్నా కూడా అతా పంక్చువల్‌గా జరిగేలా సూరీడు చూసుకునేవాడు.
అలాంటి సూరీడు, వైఎస్ మరణం తర్వాత , జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆ కుటుంబానికి క్రమంగా దూరం అయ్యాడు. ఇన్నాళ్లూ తెరవెనుకనే ఉండిపోయిన ఆయన గురువారం నాడు విజయవాడు చంద్రబాబు నివాసం వద్ద ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి ఒక రకంగా అయోమయానికి గురిచేసింది. చంద్రబాబునాయుడుతో వ్యక్తిగత పనుల నిమిత్తం సూరీడు వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు.