ఇండ్రస్ట్రీకి ఇప్పుడు ఓ వింత సమస్య వచ్చి పడింది. అదే… హీరోలు లేకపోవడం. అది నిజం. పరిశ్రమలోంచి రోజుకో కొత్త హీరో వస్తున్నాడు. ఇక ఫ్యామిలీ హీరోలకు లెక్కలేదు. ఒక్కో ఇంట్లోంచి ఇద్దరు ముగ్గురు హీరోలు వరుసగా వస్తూనే ఉన్నారు. అయినా సరే, హీరోల కొరత కనిపించడం విడ్డూరం. అందునా స్టార్ దర్శకులకు హీరోలు దొరకడం లేదు. ఓ స్టార్ దర్శకుడు, మరో స్టార్ హీరోతో పనిచేస్తేనే కిక్కూ, క్రేజూ. అందుకే పెద్ద దర్శకులంతా, పెద్ద హీరోలతో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. వాళ్లకే ఇప్పుడు హీరోలు దొరకడం లేదు.
తాజాగా ఈ పరిస్థితి సురేందర్ రెడ్డికి ఎదురైంది. సైరా తరవాత సూరి సినిమా ఏమిటో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. స్టార్ హీరోలంతా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు. మరో రెండేళ్లకు సరిపడా సినిమాలు వాళ్ల చేతుల్లో ఉన్నాయి. ఈ దశలో దర్శకులకు హీరోల్ని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. సురేందర్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా పట్టాలెక్కాల్సింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, కథ అందిస్తున్నాడు సూరి. మరోవైపు తన దర్శకత్వంలో ఓ సినిమాపట్టా లెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇది వరకే వరకే కొంతమంది నిర్మాతల దగ్గర అడ్వాన్సు తీసుకున్నాడు సూరి. వాళ్లకు సినిమాలు చేసి పెట్టాలి. అందుకే ఏదోలా ఓ హీరోని వెదుక్కోవాల్సివస్తోంది. అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్… వీళ్లంతా సూరితో సినిమాలు చేయడానికి రెడీ. కాకపోతే.. ఎవరి దగ్గరా కాల్షీట్లు లేవు. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ. వాళ్లంతా ఖాళీ అవ్వాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. మిగిలిన హీరోల పరిస్థితీ ఇంతే. స్టార్లని వదిలేసి, కొత్తవాళ్లతో సినిమాలు చేసేంత సాహసం చేయలేరు. కనీసం మిడిల్ రేంజు హీరోలతో సర్దుకుపోదామంటే.. వాళ్లు మరింత బిజీ. అందుకే… హీరోల కోసం పడిగాపులు కాస్తున్నాడు సూరి. స్టార్ దర్శకులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. మీడియం రేంజు దర్శకుల మాటేంటో..?