బడా హీరోలతో పనిచేయడం దర్శకులకు ఓ గౌరవమే. కానీ.. అది అనుకొన్నంత సులభం కాదు. కొత్త హీరోల దగ్గర, యువ కథానాయకుల దగ్గర దర్శకులకు కావల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. అనుకొన్న కథని, అనుకొన్నట్టుగా తీర్చిదిద్దుకోగలరు. అదే.. స్టార్ హీరో అనేసరికి ముందరికాళ్లకు బంధనాలు పడిపోతుంటాయి. డ్రైవింగ్ సీట్లో దర్శకుడున్నా.. స్టీరింగ్ పై కంట్రోల్ మాత్రం హీరోలు తీసేసుకొంటుంటారు. ఇప్పుడు సరిగ్గా సురేందర్ రెడ్డి విషయంలో అదే జరుగుతోంది. టాలీవుడ్‌లోని టాలెంటెడ్ దర్శకుల్లో సూరి ఒకడు. హిట్లు ఎన్నున్నాయో.. ఫ్లాపులూ అన్నే ఉన్నాయి. కిక్ 2తో మనోడి దిమ్మతిరిగి, బొమ్మ కనిపించింది. అయితే ఆ వెంటనే ధృవ సినిమా రావడం, దాన్ని హిట్ చేయడంతో సూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. రావడమే కాదు.. ఏకంగా చిరు 151వ చిత్రానికి దర్శకుడిగా అవకాశాన్ని అందుకొన్నాడు.
చిరుతో ఓ సినిమా చేస్తా – అంటూ సూరి ఒకప్పుడు చెబితే, అదంతా ధృవ ప్రమోషన్లలో భాగమే అని లైట్ తీసుకొన్నారంతా. అయితే ఈ కాంబినేషన్ విషయంలో సీరియస్ గా వర్క్ జరుగుతోంది. చిరుని తెరపై ఎలా చూపించాలన్న విషయంపై ప్రతీ దర్శకుడికీ కొన్ని ఐడియాలుంటాయి. సూరికీ అంతే. తన ఆలోచనలతో, చిరుకి సరిపడా లైన్ ఒకటి తయారు చేసుకొన్నాడు సూరి. కానీ.. చిరు మాత్రం సూరి చేతిలో ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి`’కథ ఉంచాడు. ‘దీనిపై మనం వర్క్ చేద్దాం.. నువ్వే దర్శకుడివి’ అంటూ భుజం తట్టాడు. చిరుతో సినిమా చేసే ఆఫర్ వచ్చినందుకు సంతోష పడాలో, లేదంటే `ఈ కథే చేయాలి` అంటూ కాళ్లూ చేతులూ కట్టేసినందుకు బాధపడాలో సూరికి అర్థం కావడం లేదిప్పుడు. ప్రస్తుతం సూరి పరిస్థితి ఎలా ఉందంటే.. తాను `నో` చెప్పలేడు.. అలాగని `ఉయ్యాలవాడ` సినిమానీ చేయలేడు. చిరు తో సినిమా విషయంలో తన ప్లాన్స్నీ, తనమైండ్లో ఉన్న కథనీ చిరుకీ, చరణ్‌కీ చెప్పాలని సూరి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని, అయితే ఆ అవకాశం దక్కడం లేదని సమాచారం. చిరు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి సినిమా చేయడానికి ఫిక్సయిపోయాడని, అందుకు ఓకే అంటేనే దర్శకుడిగా సూరికి అవకాశం దక్కుతుందని టాక్. ఉయ్యాల వాడ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. తానెప్పుడూ అలాంటి సినిమాల్ని డీల్ చేయలేదు. కాబట్టి.. కొంచెం జంకుతున్నాడు సూరి. కాకపోతే ఇది చిరుతో సినిమా. ఒకసారి చిరు దృష్టిలో నెగిటీవ్ ఇంప్రెషన్ పడితే.. దర్శకుడిగా తన కెరీర్‌పైనా అది ప్రభావం చూపిస్తుందేమో అని కాస్త జంకుతున్నాడట సూరి. అందుకే అతని పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు తయారైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.