దేశంలో కరోనా ప్రభావం తగ్గిపోతోంది… రికవరీ రేటు పెరుగుతోందని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది కానీ.. అసలు నిజం మాత్రం కరోనా పంజా చాలా తీవ్రంగా ఉంది. కొద్ది రోజుల్లోనే నలుగురు ఎంపీలు చనిపోయారు. వారిలో ఓ కేంద్రమంత్రి కూడా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుకు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంత్ చనిపోగా.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముగ్గురు చనిపోయారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, కర్ణాటక రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ వారం వ్యవధిలో చనిపోగా. ..తాజాగా కర్ణాటకకే చెందిన కేంద్ర మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన కరోనా సోకే వరకూ అధికార విధుల్లో చురుగ్గా ఉన్నారు. కానీ కరోనా బారిన పడి.. ఎయిమ్స్‌లో చేరిన పది రోజులకే కన్నుమూశారు.
అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే ఎంపీలే ఇలా.. వరుసగా కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఎంపీలతో పాటు వారి కుటుంబసభ్యులు.. వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేశారు. అప్పుడే కొంత మందికి పాజిటివ్ వచ్చింది. అయితే… ఆ తర్వాత కూడా సభలో అనేక మందికి నిర్ధారణ అయింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కూడా సోకింది. దీంతో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అంచనా వేయలేకపోతున్నారు.
మరో వైపు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వాలు వీలు కల్పించాయి. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నా.. అవి రాజకీయంగా… ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప.. అధికారికంగా ఎక్కడా అమలు చేయడం లేదు. ఈ క్రమంలో దేశంలో కోరనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రికవరీలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు కానీ.. నాలుగైదు రోజుల తర్వాత కరోనా రోగులను ఇంటికి పంపేసి.. క్యూర్ అయిపోయిందని రిపోర్టులు రాసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నలుగురు ఎంపీలు కరోనా బారిన పడి మరణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో ప్రజల కోణం నుంచి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.