చిత్రసీమ అసలే అనేక ఇబ్బందుల్లో ఉంది. మే 3 వరకూ లాక్ డౌన్ వల్ల థియేటర్లు తెరచుకునే అవకాశం లేదు. ఆ తరవాత కనీసం నెల రోజుల పాటు థియేటర్స్కీ, మాల్స్కీ అనుమతి లేకపోవొచ్చు. పరిస్థితి అంతా సద్దుమణిగితే జూన్ – జులైలలో సినిమా కార్యకలాపాలు మళ్లీ యధాస్ధితికి చేరుకుంటాయని పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే సీనియర్ నిర్మాత సురేష్ బాబు మాత్రం ఈ యేడాది చివరి వరకూ థియేటర్లు తెరవకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఓ సీనియర్ నిర్మాత, ప్రతీ విషయాన్నీ తూలనాత్మకంగా మాట్లాడే వ్యక్తి – ఇలాంటి కామెంట్లు చేయడం తో కరోనా భయాలు మరింతగా పట్టి పీడిస్తున్నాయి. చిత్రసీమ మరింత దుర్భరమైన స్థితిని చూడబోతుందన్న సంకేతాలు పంపుతోంది.
సురేష్ బాబు థియరీని కాస్త అర్థం చేసుకుంటే – థియేటర్ల రీ ఓపెన్ అంత సులభం కాదన్న విషయం మనకూ తెలుస్తుంది. జూన్, జులై వరకూ జన సమూహాన్ని ప్రోత్సహించే ఎలాంటి అనుమతులూ లభించవన్న విషయంలో ఎలాంటి అనుమానాలూ లేవు. అప్పటి వరకూ షూటింగులు కూడా జరగవు. ఆగస్టు నుంచి నిర్మాతలు ధైర్యం చేస్తారా? థియేటర్లకు వచ్చే ఓపిక, తీరిక, అంత ఆర్థిక సామర్థ్యం ప్రేక్షకులకు ఉంటుందా? అనే విషయాల్నీ ఆలోచించుకోవాలి. ఇంకొంతమంది నిర్మాతలు మాత్రం కాస్త భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సినిమాకి మించిన వినోద సాధనం మరోటి లేదని, కరువు కాటకాల సమయంలోనే థియేటర్లు నిండుగా కనిపించేవని, కరోనా భయాలు తొలగితే – మళ్లీ యధాతధస్థితి నెలకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరువుకాటకాలు, వరదలు – తుఫాన్లు వేరు, కరోనా వేరు. ఇలాంటి పరిస్థితి ప్రపంచం ఇది వరకు చూడలేదు. బహుశా చూడబోదు. దీన్నుంచి ప్రపంచం ఎలా బయటపడుతుందా? అనే భయమే ఎక్కువ. ఇలాంటి స్థితిలో కొత్త సినిమాలు ఎప్పుడొస్తాయో అనే ఆలోచించుకునే స్థితిలో ప్రేక్షకుడు ఉండడు. సురేష్ బాబు వాదన కూడా ఇదే.
వాస్తవాలెప్పుడూ కఠినంగానే ఉంటాయి. వాస్తవాలే మాట్లాడుకుంటే గనుక.. చిత్రసీమ మళ్లీ గాడిన పడడం అంత తేలికైన విషయం కాదు. కరోనా భయాలు ఇక లేవు.. అది మానవాళిని విడిచిపెట్టిందన్న నమ్మకం కలిగేంత వరకూ `సినిమా`కి గండం తప్పేట్టు లేదు. వ్యాక్సిన్ రావడానికి ఇంకా ఆరేడు నెలలు సమయం పడుతుందని ప్రభుత్వాలే చెబుతున్నాయి. అది వచ్చేంత వరకూ కరోనాపై భయం పోదు. అంటే.. 2020ని చిత్రసీమ మర్చిపోవాలన్నమాట. కాకపోతే ఎప్పుడూ పాజిటీవ్ కోణంలోనే ఆలోచించాలి కాబట్టి, ఈ మహమ్మారి నుంచి తొందరలోనే మానవాళికి విముక్తి లభిస్తుందని, మళ్లీ – ఎప్పటిలా సినిమా థియేటర్లు కళకళలాడిపోతాయని కోరుకుందాం.