రామానాయుడు స్టూడియోస్ కాంపౌండ్‌లో అడుగుపెట్టిన దర్శకులు అంత త్వరగా రాలేరని ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. దీనికి కారణం… సురేశ్‌బాబు అంత తేలిగ్గా కథలు ఒకే చేయరని, ఆయన్ను మెప్పించడం కాదని, నెలల తరబడి స్క్రిప్టులు చెక్కిస్తారని గుసగుసలు వినిపిస్తాయి. రీసెంట్గా ‘ఈ నగరానికి ఏమైంది?’ ప్రెస్మీట్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ సైతం ఇలాంటి మాటలు తానూ విన్నానని, అయితే ఫస్ట్‌టైమ్ కథ విన్న సురేశ్‌బాబు తన సినిమాను ఒకే చేశారని చెప్పుకొచ్చాడు. ఇటీవల సురేశ్‌బాబు ఆచి తూచి సినిమాలు చేయడం కూడా ఇటువంటి మాటలకు ఓ కారణం అనుకోవచ్చు.
వీటన్నిటినీ పక్కన పెడితే… సురేశ్‌బాబు ఒకేసారి ఐదారు సినిమాలు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. అందులో రెండు చాలామందికి తెలిసినవే. మిగతావి మాత్రం ఎవరూ ఊహించనవి. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్‌బాబు ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా వెంకీ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం కానున్నాయని చెప్పారు. అలాగే తనయుడు రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య’ సినిమా ప్లానింగులో వుందన్నారు. 18 నెలలుగా ఆ సినిమా వి.ఎఫ్.ఎక్స్ పనులు జరుగుతున్నాయని, ఇంటర్నేషనల్ స్థాయికి ఆ సినిమాని తీసుకెళ్లేందుకు భారీ బడ్జెట్‌తో క్వాలిటీగా రూపొందిస్తామని తెలిపారు. ఫ్యామిలీ హీరోలతో కాకుండా రవికాంత్ పేరెపుతో దర్శకత్వంలో ఒక సినిమా నిర్మిస్తున్నారు సురేశ్‌బాబు. మహేంద్ర దర్శకత్వంలో ‘దొరసాని’ అనే తెలంగాణ ప్రేమకథను తీస్తారట.