టాలీవుడ్ నిర్మాతల్లో ఉన్న అపరమేధావుల లిస్టు తీస్తే.. అందులో సురేష్‌బాబుకీ చోటుంటుంది. ఏ సినిమా భవిష్యత్తేంటో ఆయనకు ముందే తెలిసిపోతుంటుంది. సినిమాని మార్కెట్ చేయడంలో సురేష్ బాబు తరవాతే ఎవరైనా. ఆ సంగతి మరోసారి రుజువైంది. ‘పెళ్లి చూపులు’ సినిమాని సురేష్‌బాబు కొన్నారు. ఆయన చేతుల్లోకి వెళ్లాక… పబ్లిసిటీ ఓ రేంజులో జరుగుతోంది. నిజానికి ఈ స్ర్కిప్టు ముందు సురేష్‌బాబు దగ్గరకే వెళ్లింది. కథ నచ్చినా.. ఆయనకెక్కడో చిన్న చిన్న డౌట్లున్నాయి. దాంతో…. ఈ సినిమాని ఆయన టేకప్ చేయలేదు. సినిమా పూర్తయ్యాక… చూస్తే, సురేష్‌బాబుకి గట్టి నమ్మకం కలిగింది. అందుకే ఆ సినిమాకి రూ.కోటిన్నరకు కొనేశాడు. కోటిన్నర అంటే చీప్ రేటే కావొచ్చు. కానీ.. ఆ సినిమా రూ.60 లక్షల్లో పూర్తయింది. అందుకే పెళ్లి చూపులు నిర్మాతలు మంచి లాభంతోనే సురేష్ బాబు చేతిలో పెట్టారు.
పైగా సురేష్ బాబు అండగా ఉంటే థియేటర్ల కోసం వెదుక్కోవాల్సిన పనిలేదు. ఇప్పుడు సురేష్ బాబు పెళ్లి చూపులు సినిమాని తన సినిమాగా ప్రమోట్ చేసుకొంటున్నాడు. సురేష్ ప్రొడక్షన్ బ్రాండ్ కి ఓ వాల్యూ ఉంటుంది. దాంతో ఆటోమెటిగ్గా ఓపెనింగ్స్ బాగుంటాయి. పెళ్లి చూపులు మల్టీప్లెక్స్ సినిమా అని సురేష్‌బాబుకి ముందే తెలుసు. అందుకే… వీలైనన్ని మల్టీప్లెక్స్‌లు కవర్ చేయడానికి సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. ప్రతీ మల్టీప్లెక్స్‌లోనూ కనీసం రోజుకి ఆరేడు షోలు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అంతే కాదు. రామానాయుడు స్టూడియోలో గత వారం రోజుల నుంచీ పెళ్లి చూపులు ప్రివ్యూలు జరుగుతూనే ఉన్నాయి. స్టూడెంట్స్కీ, పాత్రికేయులకు ప్రత్యేక ప్రదర్శనలు వేసి, వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొంటున్నాడు. సినిమా ఎలాగూ బాగా వచ్చింది. కాబట్టి… వాళ్లంతా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తారన్నది సురేష్ బాబు ఆలోచన. మొత్తానికి ఓ చిన్న సినిమాని తన టెక్నిక్‌తో పెద్ద సినిమాగా మార్చేసుకొంటున్నాడు. సురేష్ బాబునా.. మజాకా??