వెంకటేష్ సినిమా అనేసరికి… దాని వెనుక ఉండి నడిపించే కర్త కర్మ క్రియ అన్నీ సురేష్ బాబునే. దానికి తోడు సురేష్ ప్రొడక్షన్స్ అంటే… వెంకీ చేయాల్సిందేం లేదు. సెట్‌కి వచ్చి నటించి వెళ్లిపోవడమే. కథ, కాస్టింగ్, ఆ సినిమా ఎవరి చేతిలో పెట్టాలి, ఎప్పుడు విడుదల చేయాలి… ఇలా అన్ని విషయాన్నీ సురేష్‌బాబునే చూసుకొంటారు. అయితే సురేష్ బాబు మితిమీరిన జోక్యం.. కొంతమంది దర్శకుల సృజనకు అడ్డుకట్ట వేస్తోంది. ఆ బాధితుల జాబితాలో కిషోర్ తిరుమల కూడా చేరిపోతున్నాడా? అనే అనుమానం వేస్తోంది. నేను శైలజతో ఆకట్టుకొన్న దర్శకుడు కిషోర్ తిరుమల. ఆ వెంటనే వెంకీ పిలిచి అవకాశం ఇచ్చాడు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో వెళ్లాడు కిషోర్. దానికి ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’ అనే టైటిల్ కూడా పెట్టారు. కథానాయికగా నిత్యమీనన్‌ని తీసుకొన్నారు. అంతా ఓకే.. ఇక షూటింగ్ కి వెళ్లిపోవొచ్చు అనుకొంటున్న సమయంలో సురేష్ బాబు.. ఎర్రజెండా ఊపినట్టు సమాచారం.
ఈ కథలో సెకండాఫ్‌కి సంబంధించి సురేష్‌బాబుకి కొన్ని డౌట్లు ఉన్నాయట. అవి క్లారిఫై అయితే గానీ బండి కదలదని టాక్. ఇప్పటికే సురేష్ బాబు చెప్పిన మార్పులు చేర్పులూ అన్నీ కిషోర్ చేసుకొచ్చాడని, అందుకే దసరాకి మొదలవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదని తెలుస్తోంది. వెంకీ కోసం తనకొచ్చిన ఆఫర్లన్నీ కిషోర్ పక్కన పెట్టాడని, ఈ కథ విషయంలో వెంకీకి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. సురేష్ బాబుకి మాత్రం సర్దిచెప్పలేకపోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ముందుకు కదిలే పరిస్థితి ఇప్పట్లో లేదని, అందుకే ఈ ప్రాజెక్టు నుంచి కిషోర్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.