తెలుగు చలన చిత్రసీమ బందు కథ సమాప్తమైంది. ఈరోజు నుంచి థియేటర్లు తెరిచేస్తారు. రేపటి నుంచి కొత్త సినిమాలూ రాబోతున్నాయి. అలా.. బంద్ విజయవంతమైంది. వారం రోజులు థియేటర్లు మూసేయడం సామాన్యమైన విషయం కాదు. అలా బంద్‌కి పిలుపు ఇవ్వబట్టే.. డిజిటల్ ప్రొవైడర్లు దారికి వచ్చారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం సురేష్బాబుదే. తన వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులూ బాగా ఫలించాయి. తన చాతుర్యం… ఈ సమయంలో అక్కరకు వచ్చింది.
సురేష్ బాబు తెలివైన నిర్మాత. పరిశ్రమలోని లోటు పాట్లు బాగా తెలిసిన వ్యక్తి. రకరకాల సెక్టార్లలో తనకు అనుభవం ఉంది. డిజిటల్ ప్రొవైడర్లతో చర్చలు, ఆ తరవాత బందు.. ఇవన్నీ సురేష్ బాబు వ్యూహాలకు అనుకూలంగా సాగాయి. డిజిటల్ ప్రొవైడర్లకు చెక్ పెట్టాలంటే.. థియేటర్లు మూసివేస్తాం అని బెదిరించాలి. అది అంత సామాన్యమైన విషయం కాదు. అటు నిర్మాతలు, ఇటు పంపిణీదారులు, ఇటు ప్రదర్శన కారులు అనుమతించాలి. అందుకే సురేష్ బాబు ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ యేడాదిలోనే అత్యంత బలహీనమైన ‘వారం’ ఎంచుకున్నాడు. అదే మార్చి 2 నుంచి మార్చి 8. ఈ వారంలో కొత్త సినిమాల హడావుడి లేదు. ఉన్నా… అవి లో బడ్జెట్ చిత్రాలే. వాటిని వాయిదా వేయించడం పెద్ద సమస్య కాదు. అందుకే మార్చి 2 న బందు చేస్తున్నాం.. అని నెల రోజుల ముందే ప్రకటించాడు. ”ఈ యేడాదిలోనే వీకెస్ట్ వీక్‌ని ఎంచుకున్నాం.. దాంతో మా పని సులభమైంది” అని సురేష్ బాబు తన బిజినెస్ సీక్రెట్ ని ప్రకటించేశాడు. సినిమా చిన్నదైనా పెద్దదైనా డిజిటల్ ప్రొవైడర్లకు వచ్చే అద్దె ఒకేలా ఉంటుంది. కాబట్టి.. ఈ మేర ఈ వారం రోజుల్లో ఎక్కువగా నష్టపోయింది వాళ్లే. అందుకే… దెబ్బకు దిగివచ్యారు. మార్చి 2 న పెద్ద సినిమాలేమైనా విడుదలకు సిద్ధమైతే.. థియేటర్లు మూసి వేయించడానికి చాలా ఇబ్బంది పడాల్సివచ్చేది. సినిమాలు లేనప్పుడు బంద్‌కి పిలుపు ఇవ్వడం వల్ల… ఈ సమస్యని చాలా ఈజీగా పరిష్కరించగలిగారు. ఈ విషయంలో సురేష్ బాబు వ్యూహ చతురతని మెచ్చుకోవాల్సిందే.