భవిష్యత్తంతా ఓటీటీ ఫ్లాట్ఫామ్లదే అన్నది చిత్ర సీమ మాట. అనుభవజ్ఞులైన దర్శక నిర్మాతలు ఇదే నమ్ముతున్నారు. లాక్డౌన్ తరవాత పరిస్థితి ఎలా వున్నా, థియేటర్లు తెరచుకున్నా లేకున్నా – ఓటీటీ కోసం సినిమాలు తీసేవాళ్ల ఎక్కువ అవ్వడం ఖాయంగా అనిపిస్తోంది. థియేటర్లు అందుబాటులో లేని సినిమాలకు ఓటీటీ గొప్ప వేదిక కాబోతోంది. అయితే… థియేటర్ల నుంచి వచ్చే రాబడి, ఓటీటీ ల నుంచి రాకపోవొచ్చు. పెద్ద సినిమాలకు థియేటర్ల రాబడే ప్రధాన ఆదాయ వనరు. దాన్ని కోల్పోయి కూడా.. పెద్దసినిమాలు తీయడం చాలా కష్టం.
ఇలాంటి పరిస్థితుల్లో సురేష్ బాబు నుంచి ఓ వినూత్నమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే.. ఓటీటీ వేదికలే నేరుగా సినిమాల్లో పెట్టుబడి పెట్టడం. అమేజాన్ లాంటి సంస్థలు.. వెబ్ సిరీస్ల కోసం ఇదే చేస్తున్నాయి. ఎవరైనా దర్శకుడు స్క్రిప్ట్ తో వెళ్తే.. అది వాళ్లకు నచ్చితే, బడ్జెట్ మొత్తం వాళ్లే ఇస్తారు. అంటే నిర్మాతని వెదుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. సినిమాలకూ ఇదే పద్ధతి వర్తిస్తే బాగుంటుందన్నది సురేష్ బాబు ఆలోచన.
సినిమాకైన బడ్జెట్ – ఓటీటీ సంస్థలు ఇవ్వకపోవొచ్చు. కానీ.. వాళ్లిచ్చే బడ్జెట్లో సినిమాలు తీయొచ్చు కదా. ఇది ఉభయ తారకంగా ఉంటుంది కూడా. ఓ కథ అమేజాన్కి నచ్చింది అనుకుందాం. బడ్జెట్ లెక్కలు వేసి, స్థానికంగా ఆ ప్రాజెక్టుని ఓ నిర్మాతకు అప్పగిస్తారు. ఆ బడ్జెట్లో నిర్మాత ఆ సినిమాని పూర్తి చేసి ఆమేజాన్కి ఇవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులే ఎక్కువగా కనిపించే ఆస్కారం ఉంది. అదే జరిగితే దర్శకులు నిర్మాతల్ని వెదుక్కోవాల్సిన పనిలేదు. తమ సినిమా విడుదల అవుతుందా, లేదా? అనే భయం కూడా ఉండదు.