సురేష్ బాబు జడ్జిమెంట్ చాలా బాగుంటుందని పరిశ్రమలో వాళ్లందరూ చెప్పేమాట. అది నిజం కూడా. ఆయనో సినిమా పట్టుకున్నారంటే… కచ్చితంగా అందులో విషయం ఉండే ఉంటుంది. అందుకే ఆయన ప్రాజెక్టుల్లో పెద్దగా డిజాస్టర్లు కనిపించవు. ఓ కథ వింటే.. అది ఏ రేంజు సినిమా అవుతుందో ఊహించి చెప్పగలరు. అలాంటి సురేష్ బాబు తెలిసి తెలిసి ఓ సూపర్ హిట్ జారవిడచుకున్నారు. అదే.. `పటాస్`. కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం… కల్యాణ్ రామ్ కెరీర్లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. అయితే ఈ కథ రానా చేయాల్సిందట. సురేష్ బాబు ఈ కథ విని, లాక్ చేసి, అందులో మార్పులు చేర్పులు కూడా చేసి… చివరి నిమిషంలో వదులుకున్నార్ట. ఈ విషయాన్ని సురేష్ బాబునే చెప్పారు. ”పటాస్ కథ మేం చేయాల్సిందే. రానా కోసం అనుకున్నాం. స్క్రిప్టు పూర్త చేసి వదులుకున్నాం. కథపై నమ్మకం లేక కాదు. ఆ సమయంలో బాహుబలి షూటింగ్‌తో రానా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ఎప్పుడు అవుతుందా? అని మేమంతా ఎదురు చూశాం. బాహుబలికి అన్నేళ్లు సమయం పడుతుందని మేం అస్సలు ఊహించలేదు. ‘పెళ్లి చూపులు’ కథ ముందు నేనే విన్నాను. ఆ తరవాతే రాజ్ కందుకూరి చేతిలో పెట్టా. తరుణ్ భాస్కర్ చెప్పినదానికంటే చాలా బాగా తీశాడు. అంత బాగా తీస్తాడని నేను కూడా ఊహించలేదు. ఇలా ఒకట్రెండు విషయాల్లో తప్ప నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పు కాలేదు” అని చెప్పుకొచ్చాడు.