ఎవరో ఒకరి బయోపిక్ ప్రస్తావన లేకుండా ఈమధ్య ఇండస్ట్రీలో పెద్ద మనుషుల ఇంటర్వ్యూలు పూర్తి కావడం లేదు. ప్రెజెంట్ ట్రెండ్ అలాగుంది మరి! సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సూపర్ హిట్టయ్యింది. మాజీ సీయంలు ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్స్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అందులో ఎన్టీఆర్ సినిమా స్టార్. ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు, డి. రామానాయుడు బయోపిక్స్ తీస్తే బావుంటుందని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రేక్షకులు అనుకుంటున్నారు.తెలుగు సినిమా అభివృద్ధికి వీరిద్దరూ చేసిన కృషి చిరస్మరణీయం. అయితే… ‘ఆఫీసర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కినేని బయోపిక్ తీసే ఉద్దేశం లేదని ఆయన తనయుడు నాగార్జున స్పష్టం చేశారు. తాజాగా నాయుడుగారి పెద్దబ్బాయి సురేశ్‌బాబు కూడా తండ్రి బయోపిక్ తీసే ఉద్దేశం లేదని చెప్పారు. “నాన్నగారి జీవితాన్ని సినిమాగా తీయమని చాలామంది అడిగారు. ఆయన బయోపిక్ వస్తే బావుంటుందన్నారు. నా దృష్టిలో బయోపిక్ తీయడం చాలా డేంజర్. ఇప్పట్లో అటువంటి ఆలోచన చేయడం లేదు” అని సురేశ్‌బాబు తెలిపారు. ప్రస్తుతానికి అయితే నాయుడుగారి బయోపిక్ లేనట్లే. భవిష్యత్తులో వస్తుందేమో చెప్పలేం!!